ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్
ప్రగతినగర్ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. అయితే పోలీసులు అంతకుముందు గేటువేసి విద్యార్థులు కలెక్టరేట్‌లోకి రాకుండా నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో ఏబీవీపీ నాయకులను పోలీసులు చెదరగొట్టారు. కొంతమందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకురాలు గాయత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఫీజు రీయిం బర్స్‌మెంట్ 2012-2013లో 1500కోట్లు ,2013-2014 లో 4,900కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని పేదవిద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయని ఆరోపించారు. ఫీజులు చెల్లించలేక కొందరు విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
విద్యార్థి సమస్యలపై పోరాటం చేసున్న విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేయడం, అక్రమంగా వారిపై కేసులు బనాయించడం దారుణమన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అరెస్టులతో విద్యార్థుల ఉద్యమాలను అణిచివేయడం అసాధ్యమన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు విష్ణు,రాకేష్,సురేష్,తుకారంతో పాటు సుమారు రెండు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఏబీవీపీ కలెక్టరేట్ ముట్టడి
Published Sat, Jul 12 2014 4:13 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement