భార్యతో గొడవపడి ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది.
హైదరాబాద్ : భార్యతో గొడవపడి ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఎస్‌ఐ అజయ్‌కుమార్ కథనం ప్రకారం...బల్కంపేట శ్యామలకుంటకు చెందిన కె.రాజు(35) ఆటో డ్రైవర్. ఇతని భార్య లక్ష్మి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయా. వీరికి కుమారుడు, కూతురు సంతానం. కాగా ఆటో సరిగా నడవకపోవడంతో రాజు తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. ఈ విషయంలో కొన్నిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది.
ఈ క్రమంలోనే శనివారం ఉదయం కూడా భార్యతో గొడవ జరగడంతో రాజు తన ఇంటికి సమీపంలో ఉన్న కరెంటు స్తంభంపైకి ఎక్కి తీగలు పట్టుకున్నాడు. షాక్ తగిలి కిందపడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రి తలసాని ఆర్థిక సాయం..
రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ శ్యామలకుంటకు వచ్చి బాధితులను పరామర్శించారు. అంత్యక్రియల నిమిత్తం వ్యక్తిగతంగా రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. రాజు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, పిల్లల చదువు విషయాన్ని చూసుకుంటుందని అన్నారు.