ఆటో, లారీ ఢీ.. ఏడుగురి దుర్మరణం
మరో ఆరుగురికి గాయాలు
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన
సర్వే కోసం వచ్చి వెళ్తుండగా ఘోరం
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా మంగళవారం జరిగిన సమగ్ర సర్వేలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారు కావటం గమనార్హం. వివరాలివీ...జిల్లాలోని మక్తల్, మాగనూరు మండలాలకు చెందిన కొందరు ముంబై, హైదరాబాద్‌లో వలస జీవనం సాగిస్తున్నారు. సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు వారంతా స్వగ్రామాలకు చేరుకున్నారు. తిరిగి వెళ్లేందుకు బుధవారం 13 మంది ఆటోలో మక్తల్‌కు బయలుదేరారు. ఉదయం 11గంటలకు వారి ఆటోను మాగనూరు సమీపంలో రాయిచూర్‌కు వెళుతున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులైన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతాపాన్ని ప్రకటించారు.
మరో ప్రమాదంలో.. తమిళ డెరైక్టర్‌కు గాయాలు
ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు-కొష్టాలు మధ్య జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో తమిళ సినిమా డెరైక్టర్ ముకళంజియం గాయపడగా.. ఆయనతోపాటు కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందాడు. ముకళంజియం తన స్నేహితుని వివాహానికి రాజమండ్రి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.