
‘అవేక్’ చిన్నారులకు విముక్తి
ప్రేమ్ రాజ్ పై కేసు నమోదు
హైదరాబాద్: నగర పరిధిలోని మౌలాలిలో ‘అవేక్ ఓ వరల్డ్’ సంస్థలో ఉంటున్న చిన్నారులకు అక్కడి బాధలనుంచి విముక్తి లభించింది. దీని నిర్వాహకుడు ప్రేమ్‌రాజ్ తన వద్ద ఉన్న చిన్నారుల పట్ల అకృత్యాలకు పాల్పడి, వారిని ఇబ్బందులకు గురిచేసిన సంగతి వెలుగు చూడడంతో చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ బాధితులకు అతని చెరనుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ‘అవేక్ ఓ వరల్డ్’ పై రెండు రోజులపాటు ప్రాథమిక విచారణ జరిపిన తరువాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం ఉదయం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మరో మారు విచారణ చేపట్టింది. ఆశ్రమంలో ఉన్న పిల్లల అభిప్రాయాలను విడివిడిగా నమోదు చేసిన తరువాత పూర్తి ఆధారాలతో సంస్థ నిర్వాహకుడిపై కుషాయిగూడా పోలీస్ స్టేషన్ లో ‘ఫోక్సో’ కేసు నమోదు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా గత ఆరేళ్లుగా ప్రేమ్‌రాజ్ నడుపుతున్న ఈ సంస్థ చట్టవిరుద్ధమైందనీ, దీనిలో పిల్లలకు రక్షణ లేదని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి, సిడబ్ల్యుసి చైర్ పర్సన్ పద్మావతి, సభ్యురాలు విజయాదేవి బృందం అభిప్రాయపడింది. తక్షణమే ఇక్కడి బాలికలను మేడిపల్లి లోని చైల్డ్ గెడైన్స్ సెంటర్‌కూ, మగపిల్లలను సైదాబాద్ లోని ప్రభుత్వ హోంకు తరలించారు. ‘అవేక్ ఓ వరల్’్డలో మొత్తం 35 మంది చిన్నారులు ఉండాల్సి ఉండగా ఏడుగురు మగపిల్లలు, 10 మంది బాలికలు కలిపి 17 మంది పిల్లలే ఉండడం గమనార్హం. మిగిలిన వారు ఏమయ్యారన్నది ప్రేమ్ రాజ్ స్పష్టం చేయాల్సి ఉంది. అదేవిధంగా శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నింబోలిఅడ్డాలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రేమ్ రాజ్ హాజరు కావాల్సి ఉంది. ‘అవేక్’లో ఉన్న 7, 8 వ తరగతుల పిల్లల పరీక్షలు మధ్యలో ఉన్నందున వారి చదువులకు ఇబ్బందికలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కమిటీ చైర్‌పర్సన్ పద్మావతి,సభ్యురాలు విజయాదేవి పేర్కొన్నారు. పూర్తి విచారణ తరువాత చిన్నారులకు ప్రభుత్వం శాశ్వత భద్రత కల్పిస్తుందని ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. ‘అవేక్’ నిర్వాకాన్ని జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్‌పర్సన్ శాంతా సిన్హా ఖండించారు. తక్షణమే నిందితుడిపై పూర్తి విచారణ జరిపించి చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.