జిల్లా ఉత్తమ అవార్డు అందుకుంటున్న మంజుల(ఫైల్)
చిట్యాల : పొదుపు బాటలో మండలకేంద్రంలోని ఐకేపీ ముందంజలో నిలిచింది. మూతపడే దశకు చేరిన ఐకేపీని పొదుపు పరంగా తీర్చిదిద్ది రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించిందేలా చేశారు అధికారులు. ఐకేపీ ఏపీఎంగా పనిచేస్తున్న పసరగొండ మంజుల ప్రజల్లో పొదుపుపై అవగాహన కల్పించి పొదుపు సంఘాలను ఎంతో బలోపేతం చేశారు. ఈ మేరకు ఏపీఎం మంజుల నాలుగేళ్ల సేవలకు అరుదైన గౌరవం దక్కింది. జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన 72 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి, కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ చేతుల మీదుగా మంజల జిల్లా ఉత్తమ సేవా పురస్కార్ అవార్డు అందుకున్నారు.
బాసటగా నిలిచిన ఏపీఎం మంజుల..
2015 ఆగస్టు 13న చిట్యాల ఐకేపీ ఏపీఎంగా మంజులనియమితులయ్యారు. ఐకేపీ కార్యాలయంలోని పొదుపు సంఘాల పరిస్థితి అధ్వాన్నంగా ఉండి ఒక దశలో లోబడ్జెట్‌తో మూసివేసే స్థితిలో ఉండగా మంజుల గ్రామాలలో విస్త్ర ృత సమావేశాలు నిర్వహించారు. శ్రీనిధి, బ్యాంకు లింకేజీపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. గుడుంబా తయారీ ఎక్కువగా జరిగే గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్య పరిచారు. ఐకేపీ పరిధిలో 796 పొదుపు సంఘాలను బలోపేతం చేసి చిట్యాల ఐకేపీని రాష్ట్ర స్థాయిలో అగ్రభాగాన నిలిపారు.
దీంతో మండల సమాఖ్యకు రాష్ట్ర స్థాయిలో అవార్డు దక్కింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐకేపీని ప్రథమ స్థానంలో నిలిపిన మంజుల సేవలకు అవార్డు రావడంపై మండల సమాఖ్య అధ్యక్షురాలు విజయ, మాజీ అధ్యక్షురాలు దర్గా, పొదుపుసంఘాల మహిళలు, సీసీలు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మండల సభలో కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు మంజులను సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment