
సాక్షి, హైదరాబాద్: మారుతున్న కాలానికనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు అందరిలో అవగాహన కలిగించేందుకు హైదరాబాద్ లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్‌ఐసీసీ)లో ఈ నెల 23న ‘సైబర్ సెక్యూరిటీ కాన్‌క్లేవ్ 3.0’ను సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) నిర్వహిస్తోంది. మంగళవారం ఈ వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ సందీప్ శాండిల్య.. ఎస్‌సీఎస్‌సీ కార్యదర్శి భరణికుమార్‌తో కలసి మీడియాకు వెల్లడించారు. ఐటీ కంపెనీలే కాకుండా ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్సియల్, హెల్త్ కేర్, రవాణా, ఆతిథ్య రంగాలకు చెందిన ప్రముఖులు ప్రసంగిస్తారన్నారు. ఆధునిక కాలంలో వేగంగా పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు అదేస్థాయిలో పెరిగా యని అభిప్రాయపడ్డారు.
ట్రోజన్లు, ర్యాన్ సమ్ వేర్లు, మాల్‌వేర్స్, బగ్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు పెను ముప్పుగా మారి సవాల్ విసురుతున్నాయన్నారు. 23న జరగనున్న ‘సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్ 3.0’లో వివిధ సంస్థలకు చెందిన ప్రముఖులు, ఇంగ్లండ్, అమెరికా, ఇజ్రాయెల్, మిడిల్ ఈస్ట్ నుంచి దాదాపు 350 మంది డెలిగేట్స్ పాల్గొంటారన్నారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన డెమో వీడియోలను చూపిస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు www.cyberrecurity.org వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. సైబరాబాద్ జాయింట్ కమిషనర్ షానవాజ్ ఖాసీం మాట్లాడుతూ.. అంతర్జాలంలో డార్క్ నెట్‌లో డ్రగ్స్, వెపన్స్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఐటీ సంస్థలు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్‌సీఎస్‌సీ సైబర్ సెక్యూరిటీ ఫోరం లీడర్ శ్రీకాంత్ శ్రీనివాసన్, ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ మోహన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment