సాక్షి, సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో వినాయకుడికి నైవేధ్యంగా పెట్టిన లడ్డూల వేలం పాటతో పాటు ఎవరు ఎక్కువ లడ్డూలు తింటారనే పోటీలు జరగడం పరిపాటి. ఆఖరి నాలుగు రోజులు ఇవి జోరుగా సాగుతాయి. లడ్డూ వేలం పాటల వరకు ఓకే అయినా అవి తినే పోటీలు మాత్రం ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని సరదా కోసం ఓ ఎఫ్‌ఎం రేడియో సంస్థ ఏర్పాటు చేసిన లడ్డూ తినే పోటీ తార్నాకలో జోషి అనే వ్యక్తి ప్రాణాలు తీసిందని గుర్తు చేస్తున్నారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం నేపథ్యంలో కొందరు మండపాల నిర్వాహకులతో పాటు వివిధ ప్రైవేట్ సంస్థలు ప్రచారం కోసం ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగా ఫ్లెక్సీల ఏర్పాటు, టోపీలు, టీ–షర్టుల పంపిణీ, లడ్డూలు తినే పోటీటూ నిర్వహిస్తారు. ఆయా పోటీల్లో అందరికంటే ఎక్కువ లడ్డూలు తిన్న వారిని విజేతగా ప్రకటించి, బంగారు నాణాలు, నగదు బహుమతులు అందజేస్తారు. ఇలాంటి పోటీలు ప్రాణాలు తీస్తాయని, ఎవరికి వారు ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని పేర్కొంటున్నారు.
గొంతులో ఇరుక్కుంటే ప్రాణాంతకమే...
ఇలాంటి పోటీల్లో పాల్గొనే వారు విజేతలుగా నిలవాలనే ఉద్దేశంతో తక్కువ సమయంలో ఎక్కువ లడ్డూలు తినే ప్రయత్నం చేస్తారు. దీనికోసం లడ్డూను పూర్తిగా నమలకుండా మింగేయడం, విరామం లేకుండా ఒకదాని తర్వాత మరోటి తినాలని చూస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో లడ్డూలు గొంతులో ఇరుక్కుంటాయని, కొన్ని సందర్భాల్లో బాధితుడిని తక్షణం ఆస్పత్రికి తరలించినా.. ఫలితాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. అలాంటి సమయంలో కనీసం మంచినీళ్లు సైతం తాగలేని పరిస్థితులు ఉంటాయని పేర్కొంటున్నారు. చివరకు గొంతులో ఇరుక్కున్న లడ్డూ కారణంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారి, బాధితుడు మృత్యు ఒడికి చేరే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ట్రేకియా దెబ్బతినడం వల్లే...
ఇలాంటి పోటీ నేపథ్యంలో లడ్డూను కంగారుగా తినడంతో అది శ్వాసనాళంలోకి వెళ్లి, ఊపిరాడక బాధితులు మరణిస్తూ ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కఠంలో ముందు భాగంలో ఉండే శ్వాసనాళం (ట్రేకియా) ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. దీని ద్వారానే మనిషి శ్వాస తీసుకుంటాడు. దానికి వెనుక వైపు వెన్నుపూసల మధ్య అన్నవాహిక ఉంటుంది. ఆహారం తీసుకునేప్పుడు గొంతులో కొండనాలిక పని తీరు వల్ల ఆ పదార్థం శ్వాసనాళంలోకి కాకుండా అన్నవాహికలోకి వెళ్తుంది. ఈ కొండనాలిక సరిగ్గా పని చేయనప్పుడే పొలమారుతూ మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతుంటాడు. లడ్డూ పోటీల నేపథ్యంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో, కంగారుగా లడ్డూలు తినడంతో కొండనాలిక సరిగ్గా పని చేయకపోవచ్చు. ఫలితంగా ఆ ఆహారపదార్థాలు ట్రేకియాలోకి వెళ్లి ఇరుక్కుపోతుంటాయి. ఫలితంగా బాధితుడికి శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారి కన్ను మూస్తుంటాడు. ఒక్కోసారి స్వరపేటిక పైన ఉండే వేగస్ నర్వ్‌పై ఒత్తిడి పెరగడంతో వేగ ఇగ్విబిషన్ అనేది ఏర్పడుతుందని ఫలితంగానూ గుండె ఆగిపోతుందని వివరిస్తున్నారు.
లడ్డూలపై కన్నేసి ఉంచండి: పోలీసులు
గణేష్ మండపాల నిర్వాహకులు వినాయకుడి విగ్రహానికి ప్రసాదంగా పెట్టే లడ్డూపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి లడ్డూలకు ఓ విశిష్టత ఉంటుంది. విభిన్న తరహాలో ఏర్పాటు చేయడం, వేలంలో భారీ రేటు పలకడం, ఉచితంగా పంపిణీ చేయడం... తదితర చర్యలతో నిర్వాహకులు భక్తులను ఆకర్షిస్తుంటారు. అయితే ఇలాంటి లడ్డూలు తస్కరిస్తే ‘శుభం’ అనే సెంటిమెంట్ సైతం కొందరికి ఉంటుందని సూచిస్తున్నారు. గతంలో ఇలాంటి నేరం చేసే ఐదుగురు యువకులు కటకటాల్లోకి చేరినట్లు తెలిపారు. అయితే సున్నిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లోని లడ్డూలు తస్కరణకు గురైతే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు దాటే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మండపాల నిర్వాహకులు పక్కాగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని రాత్రి వేళల్లో తమ ప్రసాదాలపై ఓ కన్నేసి ఉంచాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment