
దొంతాపూర్‌లో సంధ్య అంత్యక్రియలకు తరలివచ్చిన గ్రామస్తులు , సంధ్య( ఫైల్)
ధర్మపురి (కరీంనగర్): ఆమె ఏ తప్పు చేయలేదు. అదే విషయాన్ని నెత్తినోరూ మొత్తుకున్నా వినిపించుకోలేదు. చేయని తప్పునకు తనపై దొంగతనం నిందవేశారని మనస్తాపానికి గురైన ఆ విద్యార్థిని కళాశాల 4వ అంతస్తు భవనంపైనుంచి దూకింది. ఐదురోజులపాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడి‘పోయింది’. విద్యార్థిని మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సోమవారం అంత్యక్రియలు నిర్వహించగా.. గ్రామస్తులు వేలాదిగా తరలివచ్చి ఆశ్రునివాళి అర్పించారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని దొంతాపూర్ గ్రామానికి చెందిన చిగిరి భూంరెడ్డి, వసంత దంపతులకు కూతురు సంధ్య (20), కుమారుడు శ్రావణ్ ఉన్నారు. సంధ్య హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
చదువుల తల్లిగా పేరొందిన సంధ్య ఈనెల 10న కళాశాలలో రూ.1500 తీసిందని సదరు కళాశాల యాజమాన్యానికి కొందరు ఫిర్యాదు చేశారు. అయితే ఆ డబ్బులు తాను తీయలేదని, తనపై నింద మోపవద్దని ప్రాధేయపడింది. అయినా యాజమాన్యం ససేమిరా అంది. డబ్బులు తీశావని, వెంటనే చెల్లించాలంటూ సంధ్య నుంచి రూ.1500 తీసుకున్నారు. దీంతో చేయని తప్పునకు తనపై నేరం మోపారని భావించిన సంధ్య ఈనెల 10న కళాశాల 4వ అంతస్తు నుంచి దూకింది.
తీవ్రంగా గాయపడిన ఆమెను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేయిస్తుండగా ఈనెల 13న అర్ధరాత్రి మృతిచెందింది. దీంతో కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఆమె ఆత్మహత్యకు కారకులైన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా గాంధీ ఆస్పత్రికి తరలించారని కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. జరిగిన సంఘటనపై పూర్తి విచారణపై పూర్తి విచారణ చేయించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్మపురి పీఏసీఎస్ చైర్మన్ బాదినేని రాజేందర్ డిమాండు చేశారు.
చదువుల తల్లికి కన్నీటి వీడ్కోలు
సంధ్య మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామం తీసుకొచ్చారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించగా.. ఊరుఊరంతా కదిలింది. అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment