సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ఒకప్పుడు ఎన్నికల నిర్వహణ అంతా బ్యాలెట్ పత్రాలపైనే జరిగేది. 1999 ముందు వరకు ఈ విధానమే నడిచింది. ఎన్నికలకు మూడు నెలలకు ముందే ప్రధాన పార్టీలకు చెందిన బ్యాలెట్ పత్రాల ముద్రణకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేది. దేశవ్యాప్తంగా ఒకసారి జరిగే ఎన్నికలకు 7,700 టన్నుల బ్యాలెట్ పత్రాలను వినియోగించేవారు. టన్ను పేపరును ఉత్పత్తి చేయడానికి సుమారు 140 చెట్లను కోల్పోవాల్సి వచ్చేది.
ఈ లెక్కన ఒక్కో ఎన్నికకు ఎన్ని లక్షల చెట్లను మనం బ్యాలెట్ బాక్సుల్లో వేశామో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ఖర్చులో కూడా ఉద్యోగుల నిర్వహణ తర్వాత ఎన్నికల సంఘం ఎక్కువగా వెచ్చించేది బ్యాలెట్ పత్రాల ముద్రణకే. లెక్కింపులో ఆలస్యం, తేడాలు, గిమ్మిక్కులు ఎక్కువ కావడంతో అభ్యర్థుల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకునేవి. దీంతో చాలాచోట్ల రెండోసారి, మూడోసారి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చేది. 2014లో దేశంలో 80 కోట్ల మంది ఓటర్లు ఉండడంతో ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలను తీసుకువచ్చారు. వేల టన్నుల పేపరు వినియోగాన్ని తగ్గించి తక్కువ సమయంలో ఎన్నికల నిర్వహణకు అవకాశాలు మెరుగుపడ్డాయి. దేశంలో తరిగిపోతున్న పచ్చదనాన్ని కాపాడుకునేందుకు ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం.
Comments
Please login to add a commentAdd a comment