గౌలిగూడ టు సిమ్లా | Bandaru Dattatreya Appointed to as Himachal Governor | Sakshi
Sakshi News home page

గౌలిగూడ టు సిమ్లా

Published Mon, Sep 2 2019 10:12 AM | Last Updated on Mon, Sep 2 2019 10:12 AM

Bandaru Dattatreya Appointed to as Himachal Governor - Sakshi

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయను గవర్నర్‌ పదవి వరించింది. ఈ మేరకు కేంద్రం ఆయన్ను హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించడంతో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో
ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.నగరంలోని గౌలిగూడలో పుట్టిపెరిగిన దత్తన్న మరోసారి ఉన్నత పదవి చేపడుతుండడం గర్వకారణమనిపలువురు ఆయన్ని అభినందనలతో ముంచెత్తారు.   

ముషీరాబాద్‌: గౌలిగూడ బస్తీలో పుట్టి పెరిగి రాంనగర్‌ కేంద్రంగా రాజకీయాలు ప్రారంభించిన బండారు దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించడంతో బీజేపీ శ్రేణులు, అభిమానుల్లో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దత్తన్న నగరం కేంద్రంగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైనా సికింద్రాబాద్‌ లోక్‌సభ నుంచి అత్యధిక సార్లు విజయం సాధించటంతో పాటు రెండుమార్లు కేంద్రమంత్రి పదవిని చేపట్టారు. తాజాగా మరో మెట్టు ఎదిగి గవర్నర్‌ కావడంతో నగర బీజేపీ శ్రేణులు ఆదివారం ఆయనను అభినందనలతో ముంచెత్తాయి.  

సింపుల్‌ మ్యాన్‌...
గౌలిగూడలో ఓ సాదాసీదా ఇంటిలో నివాసం ఉన్న దత్తాత్రేయ మొదటిసారిగా 1991లో సికింద్రాబాద్‌ పార్లమెంటు నుంచి ఎన్నికయ్యారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 1998లో రాంనగర్‌కు మకాం మార్చారు. అదే సమయంలో వాజ్‌పేయి ప్రభుత్వంలో గ్రామీణాభివద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. రాంనగర్‌లోనే నివసిస్తూ ఒక కిరాయి ఇంట్లో సుమారు రెండేళ్లు ఉండి అదే ప్రాంతంలో ఇల్లు నిర్మించుకున్నారు. ఇప్పటికీ అదే ఇంట్లో ఉంటూ దాదాపు 22 ఏళ్లుగా రాంనగర్‌తో అవినాభావ సంబంధం ఏర్పర్చుకున్నారు. ఎంపీ అయినా, కాకపోయినా అందరితో కలిసిపోవడం, ఎలాంటి ఆర్భాటాలకు పోక పోవడం ఆయన నైజం. ఎప్పుడు చూసినా సౌమ్యంగా కనబడడం, ముఖ్యంగా మధ్యతరగతి, పేదలకు అందుబాటులో ఉండ డం అతని సహజ లక్షణం. అం దుకే మినిస్టర్‌ కాగానే ఎంతో మం ది సన్నిహితులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లకు వెళ్దామని ఒత్తిడి తెచ్చినా లొంగకుండా పేదలకు అందుబాటులో ఉండాలనే ఒకే ఒక్క కారణంతో రాంనగర్‌ను విడిచి వెళ్లలేదు. 


కూతురు వివాహ రిసెప్షన్‌లో ప్రధాని మోదీతో దత్తాత్రేయ
ఆలస్యంగా వివాహం...

ఆర్‌ఎస్‌ఎస్‌లో, సేవా కార్యక్రమాల్లో మునిగితేలిన దత్తాత్రేయ వివాహం చేసుకోవాలనే ఆసక్తి కనపర్చలేదు. వివాహం తన పార్టీ కార్యక్రమాలకు విఘాతం కల్గిస్తుందని భావించారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయి సూచన మేరకు ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి 1980లో బీజేపీలో చేరారు. బీజేపీలో కూడా చురుకైన పాత్ర పోషించి 1981–89 వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ సమయంలో పార్టీ పెద్దలు, సహచరులు వివాహం చేసుకోవాలని ఒకవైపు ఒత్తిడి చేస్తుండగా.. మరోవైపు సమీప బంధువైన వసంత దత్తాత్రేయనే చేసుకుంటానని,   లేకపోతే పెళ్లి చేసుకోనని చెప్పడంతో చివరికి తన 42వ ఏటా పెండ్లి చేసుకున్నారు. ఆయన కూతురిని బీజేపీ ముఖ్యనాయకుడు బి.జనార్ధన్‌రెడ్ది తనయుడు డాక్టర్‌ జిగ్నేష్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. కుమారుడు సంవత్సరం క్రితం గుండెపోటుతో మరణించడంతో దత్తాత్రేయ మానసికంగా కుంగిపోయారు. అయినా తేరుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సమయంలో హిమచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. 

అభినందనల వెల్లువ
బీజేపీ అగ్రనేత బండారు దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ఆదివారం ఉదయం వార్త వెలువడగానే ఆయన నివాసం అభిమానులతో నిండిపోయింది. అధికారిక ప్రకటన వచ్చే సమయానికి దత్తాత్రేయ నాంపల్లిలో గణేష్‌ ఉత్సవ సమితి సమావేశంలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఉత్సవ సమితి సభ్యులు ఆయనను అభినందనలతో ముంచెత్తారు. కొత్త బాధ్యతల్లోకి వెళుతున్న దత్తాత్రేయను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్లు నరసింహన్, విశ్వభూషణ్‌ హరిచందన్, విద్యాసాగర్‌రావు, కల్‌రాజ్‌ మిశ్రా, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కె.కేశవరావు, రామ్మోహన్‌రావు,సుజనాచౌదరి, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, కేంద్ర మంత్రులు జవదేకర్, ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎంఎల్‌సీ చుక్కా రామయ్య, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు అభినందించారు.  

అమ్మవారికి బోనం
చాంద్రాయణగుట్ట: హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్‌నేత బండారు దత్తాత్రేయకు పాతబస్తీ ఆషాఢ మాసం బోనాలతో విడదీయరాని అనుబంధం ఉంది. ఏటా ఉత్సవాలకు హాజరై లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంతో పాటు ఈ ఏడాది కూడా అమ్మవారి ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.   

ఓయూలో మార్నింగ్‌ వాక్‌
ఉస్మానియా యూనివర్సిటీ: బండారు దత్తాత్రేయ నియామకం పట్ల ఓయూలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓయూ క్యాంపస్‌కు ప్రతి రోజు మార్నింగ్‌ వాకింగ్‌కు వచ్చి అనేక మంది ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులతో వివిధ అంశాలపై చర్చించేవారు. కేంద్ర మంత్రిగా ఓయూలో ఉద్యోగ, ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ఎంప్లాయిమెంట్‌ బ్యూరో కార్యాలయాన్ని ప్రారంభించారు. లేడీస్‌ హాస్టల్‌లో ప్రతి ఏటా విద్యార్థినులు జరుపుకును బతుకమ్మ పండుగలో పాల్గొనేవారు. ఏబీవీపీ నాయకులను పేరుపెట్టి పిలిచేంత చనువుగా ఉండేవారు. సికింద్రాబాద్‌ ఎంపీగా, మంత్రిగా దత్తాత్రేయ ఓయూలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు.

కళా పురస్కారాల ప్రదానం
వివేక్‌నగర్‌:మోహన్‌ ట్రస్ట్, కీర్తన ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం త్యాగరాయ గానసభలో 12గంటల పాటు తెలుగు కళా సంరంభం, సంగీత నృత్య సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు మాజీ గవర్నర్‌ డా.కె.రోశయ్య వివిధ రంగాల ప్రముఖుల్ని కళా పురస్కారాలతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సాంçస్కృతిక సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బీసీ కమిçషన్‌ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహనరావు, దైవజ్ఞశర్మ, కొత్త కృష్ణవేణి, మహ్మద్‌ రఫీ, వై.రాజేంద్రప్రసాద్, మోహన్‌ గాంధీ, శ్రీనివాసగుప్తా, శశిబాల తదితరులు పాల్గొన్నారు.

కుమ్మేసింది
వర్షం కుమ్మేసింది. ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రహదారులపై వరద పోటెత్తింది. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.   హుస్సేన్‌సాగర్‌ (ట్యాంక్‌బండ్‌) నీటి మట్టం ఆదివారం సాయంత్రానికి +513.410 అడుగులకు చేరింది. ట్యాంక్‌బండ్‌ సామర్థ్యం +514.910 అడుగులు కావడంతో భయపడాల్సిన అవసరం లేదని జీహెచ్‌ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement