తెలంగాణలో బీజేపీకి అధికారమే లక్ష్యం
కేంద్ర మంత్రిగా వెళ్లనున్న నేపథ్యంలో బండారు దత్తాత్రేయ
ఇక్కడ పార్టీని బలోపేతం చేయడం నా విధి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలనేది తమ లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం తన ముఖ్య విధి అని, ఇందుకోసం తనకు కేంద్ర మంత్రి పదవి ఉపకరిస్తుందని భావిస్తున్నానని ఆయన చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను కలుపుకొని వెళ్లి.. ఇరు రాష్ట్రాల ప్రగతికి తనవంతు కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న దత్తాత్రేయ.. కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఢిల్లీకి బయలుదేరేముందు ‘సాక్షి’తో మాట్లాడారు. కేంద్ర మంత్రి పదవికి తనను ఎంపిక చేసినట్లుగా మోదీ ఫోన్ చేసి చెప్పడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని దత్తాత్రేయ చెప్పారు. ‘‘మీకు మంత్రి పదవి రావడం కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు మీ సేవలు అవసరమయ్యాయి. నాతో కలిసి పనిచేయండి..’ అని ప్రధాని మోదీ నాకు ఫోన్ చేసి చెప్పడాన్ని ఎప్పటికీ మరవలేను. అప్పట్లో ప్రధాని హోదాలో అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఇలాగే ఫోన్‌చేసి చెప్పారు. నా జీవితంలో రెండు మరపురాని ఘట్టాలివి. భారీ మెజారిటీతో బీజేపీ విజయం సాధించి మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకున్నాను. అయితే నాకు పిలుపు రాలేదు. దానికి నేను బాధపడలేదు. ఎప్పుడో ఓసారి ఆయన నుంచి పిలుపు వస్తుందని నాకు తెలుసు. మోదీ ఆశించినట్టుగా పార్టీని పటిష్టం చేసే పనిలో నిమగ్నమయ్యాను. నేను ఊహిం చినట్టుగానే మోదీ నుంచి పిలుపు వచ్చింది. ఆయనతో కలిసి పనిచేసేందుకు ఢిల్లీకి వెళ్తున్నాను. ఏ బాధ్యతలు అప్పగించినా క్రమశిక్షణతో పనిచేస్తా. దేశాన్ని అభివృద్ధి చేయాలనే కృత నిశ్చయంతో ఉన్న మోదీ అడుగుజాడల్లో నడవడమే నా కర్తవ్యం. ఫలానా శాఖ కావాలనే కోరిక నాకు లేదు. ఏదైనా మనసు పెట్టి పనిచేస్తాను. ప్రజలకు మేలు జరిగేలా ప్రయత్నిస్తా. తెలంగాణలో ఏకైక ఎంపీని అయినందున నాకు ఈ పదవి రాలేదు. గతంలో మంత్రిగా నా పనితీరును గుర్తించే మోదీ మరో అవకాశం కల్పించారు..’’ అని ఆయన తెలిపారు.
పార్టీ బలోపేతమే ముఖ్యం
కేంద్ర మంత్రిగా ఢిల్లీకే పరిమితం కాబోనని, తన శాఖ డిమాండ్ చేసినంత మేర దేశం నలుమూలలా తిరుగుతూ పనిచేస్తానని దత్తాత్రేయ చెప్పారు. ‘‘ఇక ప్రభుత్వంలో ఉన్నా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయటం నా ముఖ్య విధి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవాలనే పార్టీ లక్ష్యంలో నేను భాగస్వామ్యం పంచుకుంటాను. కేంద్రమంత్రిగా పనిచేసే అవకాశం దానికి ఉపకరిస్తుందని ఆశి స్తున్నా. పొరుగు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రగతికి కూడా నా వంతు కృషి చేస్తా. ఇద్దరు ముఖ్యమంత్రులను కలుపుకొని వెళ్లి రెండు రాష్ట్రాల ప్రగతికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా’’ అని ఆయన పేర్కొన్నారు.
దత్తన్న ప్రస్థానమిదీ..
పుట్టిన తేదీ: జూన్ 12, 1947
చదువు: బీఎస్సీ
రాజకీయ ప్రస్థానం...
1965లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిక
1975-77లో లోక్ సంఘర్ష సమితి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు
1980లో బీజేపీలో చేరిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా నియామకం
1997-98, 2006లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు
2004లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా, పార్టీ తమిళనాడు రాష్ట్ర ఇన్‌చార్జిగా బాధ్యతలు
2010లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియామకం. కేరళ ఇన్‌చార్జిగా బాధ్యతలు
ముఖ్య పదవులు..
1991-1996 మధ్య సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నారు.
1998లో మరోసారి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి.. 1998-1999 మధ్య వాజ్‌పేయి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.
1999 సికింద్రాబాద్ ఎంపీగా మూడోసారి విజయం.. 1999-2001 మధ్య కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు
2001-2003 రైల్వే శాఖ సహాయ మంత్రి, 2003-04 పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)
2014లో సికింద్రాబాద్ ఎంపీగా మరోసారి విజయం.. తాజాగా కేంద్ర మంత్రి పదవి
కోకోనట్ బోర్డు, టెలిఫోన్ అడ్వైజరీ బోర్డు, రైల్వే అడ్వైజరీ బోర్డు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీల్లో సభ్యుడిగా పనిచేసిన అనుభవం
ఓటములు..
2004, 2009 వరుస ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో ఓటమి