కరీంనగర్ : మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాల పెంపు కోసం గత 12 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీలు శుక్రవారం ఇచ్చిన బంద్ పిలుపునకు వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు మద్దతు ప్రకటించాయి. దీంతో జిల్లావ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరిగింది. కరీం నగర్‌లో ఉదయం 6గంటలకే వామపక్ష పార్టీల నేతలు, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, బోయిని అశోక్, పైడిపల్లిరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, న్యూడెమోక్రసీ నాయకులు జూపాక శ్రీనివాస్, జిందం ప్రసాద్, ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ నాయకులు గవ్వ వంశీధర్‌రెడ్డి తదితరులు బస్‌డిపో ముందు బైఠాయించి బస్సులు బయటికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.
పోలీసులు జోక్యం చేసుకొని వారిని అదుపులోకి తీసుకోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, పట్టణ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్ ఆధ్వర్యంలో టవర్‌సర్కిల్, తెలంగాణచౌక్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించి బంద్‌లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఆనంతరం నగరంలోని బస్టాండ్, ప్రధాన వ్యాపార కూడళ్లలో ఆయా పార్టీల నాయకులు తిరుగుతూ బంద్ చేయించారు. విద్యాసంస్థలు సెలవు ప్రకటించగా, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంక్‌లు మధ్యాహ్నం వరకు మూసివేశారు. వామపక్ష పార్టీలు, మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల రాస్తారోకోలు, బైక్‌ర్యాలీలు నిర్వహించారు. జగిత్యాలలో ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో తహశీల్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.
హుజూరాబాద్‌లో సీపీఎం రాష్ట్ర నాయకులు మర్రి వెంకటస్వామి ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. గంగాధర మండల కేంద్రం లో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ ఇంటి ముందు కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు నిరసన తెలిపి బంద్‌లో పాల్గొన్నారు. సిరిసిల్లలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామల మల్లేశం ఆధ్వర్యంలో వామపక్ష పార్టీల నేతలు, కార్మికులు బంద్ పాటించారు.
హుస్నాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు కేడం లింగమూర్తి, ఆకుల వెంకట్, సీపీఎం నాయకులు కొయ్యడ కొమురయ్య ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. మానకొండూరు, కోరుట్ల, మంథని, వేములవాడ, పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గ కేంద్రాల్లో వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్, టీడీపీ, విద్యార్థి యువజన సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు.
బంద్ సంపూర్ణం
Published Sat, Jul 18 2015 1:50 AM | Last Updated on Tue, Oct 16 2018 7:27 PM
Advertisement