ఇబ్రహీంపట్నం: దొంగల చోరీ వ్యూహం ఫలించలేదు. పోలీసులు రావడంతో పరారయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇబ్రహీంపట్నంలోని సహకార కేంద్ర బ్యాంకులోకి చొరబడ్డారు. బీట్ కానిస్టేబుళ్లు అక్కడి రావడంతో పరారయ్యారు. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఓ ఇన్నోవా వాహనంతో పాటు చోరీకి ఉపయోగించేందుకు దొంగలు తీసుకొచ్చిన గ్యాస్ సిలిండర్లు, కట్టర్లు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం క్లూస్ టీం, జాగిలాలలో వివరాలు సేకరించారు. సీఐ మహ్మద్‌గౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి ఇబ్రహీంపట్నం పీఎస్ కానిస్టేబుళ్లు రామకృష్ట, భీమాగ్నిలు బీట్‌లో ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో వారు పట్టణంలోని సహకార బ్యాంక్ పరిసరాల్లో ఉన్నారు.
బ్యాంక్ దగ్గర ఓ వ్యక్తి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో అతడిని ప్రశ్నించారు. అంతలోనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తుండగా బ్యాంక్ భవనం వెనక గ్యాస్ సిలిండర్లు కనిపించాయి. అక్కడే ఉన్న ఓ ఇన్నోవా(ఏపీ16బీఆర్2473)ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ దగ్గరికి వెళ్లి చూడగా కిటికీ ఊచలు తొలగించి ఉన్నాయి. సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్ డీసీపీ రవివర్మ, ఇబ్రహీంపట్నం ఏసీపీ నారాయణ, సీఐ మహమ్మద్‌గౌస్‌లు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆదివారం ఉదయం క్లూస్ టీం, జాగిలాలతో వివరాలు సేకరించారు. బ్యాంకులో ఎలాంటి చోరీ జరగలేదని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేనేజర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. కాగా బ్యాంక్‌లో కొంతకాలంగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, ఈవిషయమై తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. బ్యాంక్‌కు సెక్యూరిటీగార్డు కూడా లేడు. ఆదివారం సెలవు కావడంతో బ్యాంకులో చోరీ సులభమని దొంగలు భావించి ఉంటారని పోలీసులు తెలిపారు. చోరీ యత్నంలో దాదాపు ముగ్గురునలుగురు దుండగులు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే మూఠానా..?
ఘట్‌కేసర్: మండలంలోని జోడిమెట్లలో దక్కన్ గ్రామీణ బ్యాంకులో చోరీకి పాల్పడిన ముఠా, ఇబ్రహీంపట్నం సహకార కేంద్ర బ్యాంకులో చోరీకి యత్నించింది ఒకే ముఠా అయి ఉండొచ్చని ఘట్‌కేసర్ పోలీసులు అనుమానిస్తున్నారు. గతనెల 9న దక్కన్ గ్రామీణ బ్యాంకులో దుండగులు కిటి కీ ఊచలు హైడ్రాలిక్ జాకీ సహాయంతో వంచి లోపలికి చొరబడి రూ. 35 లక్షల నగదు, 9 తులాల బంగారం అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. రెండు ఘటనల్లో దుండగులు కిటికీలను వంచడం, ఒకేవిధమైన సామగ్రి ఉపయోగించారు. ఈనేపథ్యంలో రెండు ఘటనలకు పాల్పడిందే ఒకే ముఠా కావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఘట్‌కేసర్ సీఐ రవీందర్ ఆదివారం తెలిపారు. నెల రోజుల్లో రెండు ఘటనలు చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర సంచలనం కలిగింది. కాగా పూర్తిగా నిర్ధారణకు రావడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఇబ్రహీంపట్నంలో పోలీసులు రావడంతో దొంగలు తమ ఇన్నోవా వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. దీంతో ఆధారాలు కొంతమేర దొరికే అవకాశం ఉందని చెప్పారు. త్వరలో దుండగులను పట్టుకొని కటకటాల వెనక్కి పంపుతామని సీఐ చెప్పారు.
కొంతే రికవరీ..
ఐదేళ్ల క్రితం యాచారం పీఏసీఎస్‌లో నాలుగున్నర కిలోల బంగారం, నగదు చోరీ
రెండున్నర కిలోల బంగారాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్న పోలీసులు
యాచారం: మండల కేంద్రంలోని పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం)లో 2009 జరిగిన చోరీ ఘటనలో పోలీసులు పూర్తిస్థాయిలో సొత్తు రికవరీ చేశారు. దొంగలు అప్పట్లో నాలుగున్నర కిలోల బంగారం, రూ. లక్ష నగదు అపహరించారు. ఏడాది తర్వాత దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు వారి నుంచి కేవలం రెండున్నర కిలోల బంగారాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఖాతాదారులు ఆందోళన చేయడంతో అధికారులు పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తుతో పాటు సంస్థకు చెందిన రూ. 50 లక్షల నగదును బాధితులకు పంపిణీ చేశారు. కాగా ఇప్పటికైనా పోలీసులు పూర్తిస్థాయిలో సొత్తు స్వాధీనం చేసుకుంటే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.