
ఆశలు గల్లంతు
భీక్యాతండా...ఒక్కసారి భయపడిపోయింది.విహారయాత్రకని వెళ్లిన తండాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి బానోతు రాంబాబు హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఆదివారం సాయంత్రం గల్లంతయ్యాడు. సోమవారం పొద్దుపోయే వరకూ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో రాంబాబు తల్లి బుజ్జి ఒక్క సారిగా స్పృహ కోల్పోయింది. కొద్దిసేపటికి ఆమె తేరుకుంది. ‘కొడుకా ఎక్కడా’ అంటూ ఆమె రోదించిన తీరు అందరినీ కంటతడిపెట్టించింది. మరోవైపు ఇదే విహారయాత్రకు వెళ్లిన మరో ఇద్దరు విద్యార్థులు క్షేమమన్న సమాచారంతో ఆ కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.
మోతె : కొడుకు తమ కుటుంబానికి ఆసరాగా ఉంటారని భావించారు ఆ తల్లిదండ్రులు. రెక్కలు ముక్కలు చేసుకొని ఉన్నత చదువులు చెప్పిస్తున్నారు. చదువుల్లో ఎప్పుడూ ముం దుండే రాంబాబు ఉన్నత స్థితిలో ఉంటాడని అంతా భావించారు. కుటుంబాన్ని ఆదుకోవాల్సిన కొడుకు వరద నీటిలో కొట్టుకు పోవడంతో ఆ కుటుంబం షాక్‌కు గురైంది. మోతె మండలం లాల్‌తండా గ్రామ పంచాయతీ పరిధి భీక్యాతండాకు చెందిన బానోతు శేఖర్, బుజ్జిలకు ఇద్దరు కుమారులు. అందులో రెండో కుమారుడైన బానోతు రాంబాబు(20) హైదరాబాద్‌లో వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో ఈఐఈ మెకానికల్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం తన తోటి విద్యార్థులతో హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లాలోని బియాస్ నదికి వచ్చిన వరదల్లో స్నేహితులతో పాటు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాడు. ఈ విషయం తెలిసిన వెంటనే బాధితుడి తల్లి బుజ్జి షాక్‌కు గురై అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. తండ్రి శేఖర్ హైదరాబాద్‌కు వెళ్లాడు.
మిన్నంటిన రోదనలు
కాలేజీ విద్యార్థులతో వారం రోజుల పాటు విహారయాత్రలకు వె ళ్లి వస్తానని చెప్పి అనంత లోకాలకు వెళ్లినావా కొడుకా.. పెద్ద చదువులు చదివి కుటుంబాన్ని ఆదుకుంటావనుకుంటే.. మధ్యలోనే వెళ్లిపోయావా కొడుకా..ఇక మాకెవరు దిక్కంటూ రాంబాబు తల్లి బుజ్జి రోదిస్తున్న తీరు తండావాసులను కంట తడిపెట్టించింది.
విషాదంలో తండావాసులు
తమ తండాకు చెందిన విద్యార్థి నీటి ప్రమాదంలో మృతి చెందాడని తెలియడంతో తండావాసులు విషాదంలో మునిగిపోయారు. అందరితో కలివిడిగా ఉండే రాంబాబు నదిలో గల్లంతయ్యాడన్న విషయాన్ని తాము నమ్మలేకపోతున్నామని తెలిపారు. మృతుని తల్లిదండ్రులను డిప్యూటీ తహసీల్దార్ హుస్సేన్, ఆర్‌ఐ శైలజ, గ్రామపెద్దలు మాతృనాయక్, గ్రామస్తులు పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
చదువులో ఎప్పుడూ ముందుండే వాడు : స్నేహితులురాంబాబు చిన్నతనం నుంచి చదువులో ముం దుండేవాడని అతని స్నేహితులు తెలిపారు. అతను ఒకటి నుండి తొమ్మిది వరకు సూర్యాపేటలో, పదవ తరగతి కోదాడలో, ఇంటర్ సూర్యాపేట త్రివేణి కాలేజీలో చదివాడని తెలిపారు. తల్లిదండ్రులకు వ్యవసాయ పనులల్లో సహాకారిగా ఉండేవాడని రాంబాబు తాతయ్య అమ్మమ్మ రోదిస్తూ తెలిపారు.