గో‘దారి’లో...బాసర టు చెన్నై | basara to chennai | Sakshi
Sakshi News home page

గో‘దారి’లో...బాసర టు చెన్నై

Published Sat, Apr 4 2015 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

బకింగ్‌హామ్ కాలువ

బకింగ్‌హామ్ కాలువ

రాష్ట్రంలో ఇప్పటివరకు ఊహలకే పరిమితమైన జలరవాణా వాస్తవరూపం దాల్చేందుకు మార్గం సుగమం అవుతోంది.

గోదావరి నదిని జల రవాణా పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం ఓకే
 సముద్రతీరంలోని పోర్టులతో రాష్ట్రానికి అనుసంధానం
 పెద్ద సరుకు రవాణా నౌకలు వెళ్లేలా ఏర్పాట్లు
 బాసర నుంచి రాజమండ్రి వరకు గోదావరి నదిలో..
 అక్కడి నుంచి చెన్నై వరకు బకింగ్‌హామ్ కాలువలో రవాణా
 ఈ ప్రాజెక్టుతో రవాణా వ్యయం నాలుగో వంతుకు తగ్గుతుందని అంచనా
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు ఊహలకే పరిమితమైన జలరవాణా వాస్తవరూపం దాల్చేందుకు మార్గం సుగమం అవుతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న గోదావరి నదిని జల రవాణా పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనిని ఆంధ్రప్రదేశ్‌లోని బకింగ్‌హామ్ కాలువతో అనుసంధానించటం ద్వారా బాసర నుంచి చెన్నై వరకు జల రవాణా మార్గాన్ని ఏర్పాటు చేసే బృహత్తర ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. దీనితో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, కృష్ణపట్నం, నిజాంపట్నం, దుగరాజపట్నం ఓడరేవులతో తెలంగాణ అనుసంధానమవుతుంది. ఈ ప్రా జెక్టు సాకారమైతే చాలా తక్కువ వ్యయంతో సరుకులను రవాణా చేసేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటివరకు రైల్వే, రోడ్డు మార్గాల ద్వారా రవాణా అవుతున్న బొగ్గు, సిమెంటు, ఉక్కుతోపాటు నిత్యావసర వస్తువులను ఈ నదీ మార్గం ద్వారా రవాణా చేస్తారు.
 
 అంకురార్పణ ఇలా..
 
 కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొంతకాలంగా నదుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారిం చింది. వృథాగా సముద్రంలోకి చేరుతున్న నీటిని.. ఇతర నదుల్లోకి మళ్లించి, సద్వినియోగం చేసుకోవడం దీని ఉద్దేశం. అయితే ఇదే సమయంలో జలరవాణా అంశం తెరపైకి వచ్చింది. దేశంలో రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఎక్కువగా రవాణా జరుగుతోంది. దీనికి భారీగా ఖర్చు అవుతుంది. అదే జలరవాణా అందుబాటులోకి వస్తే రవాణా వ్యయం నాలుగో వంతుకు తగ్గుతుందని నిపుణులు తేల్చారు. ఈ క్రమంలో దేశంలోని 101 నదులను అనుసంధానించి జలరవాణాకు వినియోగించుకునే బృహత్తర పథకానికి కేంద్రం రూపకల్పన చేస్తోంది. దీనికి సంబంధించి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాలని యోచిస్తోంది. అందులో తెలుగు రాష్ట్రాల్లోని బాసర నుంచి చెన్నై వరకు నదీ రవాణా ప్రాజెక్టును కూడా చేర్చబోతోంది.
 
 గడ్కారీ రాకతో సానుకూలం..
 
 జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేసేందుకు రెండు రోజుల కింద కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ రాష్ట్రానికి రావడం ఈ ప్రాజెక్టుకు సానుకూలంగా మారింది. గతంలోనే రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో గడ్కారీతో భేటీ అయి దీనిపై చర్చించారు. ఒకటి రెండు సార్లు సీఎం మాట్లాడారు. గడ్కారీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా.. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు గడ్కారీతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమై చర్చించారు కూడా. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రోడ్లను పరిశీలించిన గడ్కారీ...  రవాణా పరంగా తెలంగాణ బాగావెనకబడిందని, దానిని అధిగమించేందుకు కేంద్రం కచ్చితంగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే జలరవాణాపై సానుకూల ప్రకటన చేశారు. పైగా గోదావరి నదికి ఎగువన గడ్కారీ సొంతరాష్ట్రం మహారాష్ట్ర ఉండటంతో... గోదావరిపై జలరవాణా అభివృద్ధి చేస్తే మహారాష్ట్రకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందని  భావిస్తున్నారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న  జలరవాణా ప్రాజెక్టులో ఈ మార్గాన్ని కూడా చేరుస్తున్నట్టు సూత్రప్రాయంగా వెల్లడించారు.
 
 అనుసంధానం ఇలా..
 
 బాసర నుంచి ఖమ్మం జిల్లా భద్రాచలం వరకు గోదావరి నది రాష్ట్రానికి అనుకూలంగా ఉంది. కానీ దాన్ని సముద్ర మార్గ కేంద్రమైన చెన్నైతో అనుసంధానించేందుకు కొంత కసరత్తు అవసరమవుతోంది. ఇందుకోసం చారిత్రక బకింగ్‌హామ్ కాలువతో అనుసంధానాన్ని తెరపైకి తెచ్చారు. బ్రిటిష్ పాలనా సమయంలో కాకినాడ నుంచి తమిళనాడులోని విల్లుపురం వరకు 796 కిలోమీటర్ల మేర బకింగ్‌హామ్ కాలువను నిర్మించారు. బ్రిటిష్ పాలన తర్వాత ఈ కెనాల్ ద్వారా రవాణా నిలిచిపోవడంతో.. నామమాత్రంగా మిగిలిపోయింది. కొంతకాలం కింద దానిని పునరుద్ధరించేందుకు ‘ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా’ చర్యలు ప్రారంభించింది. పులికాట్ సరస్సుతో అనుసంధానించి.. పుదుచ్చేరి వరకు విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పనులు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు దానిని మరింత విస్తరించి విశాలమైన గోదావరితో అనుసంధానించాలనే ప్రణాళిక తెరపైకి వచ్చింది. గోదావరిపై రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కృష్ణా కెనాల్ ద్వారా కృష్ణా బ్యారేజీలోకి అక్కడి నుంచి కొమ్ముమూరు కెనాల్ ద్వారా బకింగ్‌హామ్ కెనాల్‌తో అనుసంధానిస్తారు. ఫలితంగా గోదావరిలో బాసర నుంచి మొదలై నేరుగా చెన్నై వరకు జల రవాణా మార్గం ఏర్పడుతుంది.
 
 ప్రాజెక్టులకు నావిగేషన్ డిజైన్..
 గోదావరిలో నౌకలు వెళ్లాలంటే మధ్యలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. భారీ ప్రాజెక్టులు, వంతెనలు నిర్మిస్తే నౌకలు వెళ్లేందుకు మార్గం కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులు, వంతెనలకు ఇలాంటి వెసులుబాటు కల్పించేలా డిజైన్లు మార్చుకోవాలని సూచించింది. ఫలితంగా ఇప్పటికే నమూనా సిద్ధమైన పోలవరం డిజైన్ మార్చాల్సి ఉంది. దీనిపై గడ్కారీ స్వయంగా ఏపీ ప్రభుత్వంతో మాట్లాడినట్టు తె లిసింది. ఇక రాష్ట్రంలోని దుమ్ముగూడెం, ఎల్లంపల్లి, కంతనపల్లి ప్రాజెక్టులకు కూడా ఆ తరహాలో డిజైన్ మార్చాల్సి ఉంటుంది. ఇక భద్రాచలం వద్ద గోదావరిపై నిర్మించబోతున్న వంతెనను కూడా దీనికి తగ్గట్టుగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఎస్సారెస్పీ ప్రాజెక్టు, భద్రాచలం పాత వంతెనల వద్ద మార్పు చేర్పులు చేయాల్సి ఉంటుంది.
 
 నదిలో ప్రత్యేక కెనాల్..
 సరుకు రవాణా నౌకలు వెళ్లాలంటే నిర్ధారిత పరిమాణంలో నదిలో నీరు ఉండాలి. ఎండాకాలంలో చాలాచోట్ల ఇసుక దిబ్బలు తేలి ఉంటాయి. దీంతో గోదావరి నదిలో ఒక పక్కన నిర్ధారిత పరిమాణంలో ప్రత్యేక కెనాల్‌ను ఏర్పాటు చేస్తారు. దీనికి అక్కడక్కడ గేట్లు బిగిస్తారు. అందులో నిరంతరం నిర్ధారిత పరిమాణంలో నీటి నిల్వ ఉండేలా ఏర్పాటు చేస్తారు. నౌక వెళ్లగానే గేట్లు మూసి నీటి నిల్వను నియంత్రిస్తారు.
 
 భారీ ఆదా..
 సరుకు రవాణాలో రైలు మార్గానికి నాలుగు రూపాయలు, రోడ్డు మార్గంలో తరలిస్తే మూడు రూపాయలు వ్యయమయ్యే చోట... జలరవాణాకు కేవలం అర్ధరూపాయి మాత్రమే ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం లెక్కలేసింది. దీనికి సంబంధించి కేంద్రం డీపీఆర్‌లు సిద్ధం చేస్తోంది.
 
 ఇదీ మార్గం..
 
 (గోదావరి నదిలో..)
 బాసర - శ్రీరాంసాగర్ - ధర్మపురి - రామగుండం- కాళేశ్వరం - ఏటూరు నాగారం - భద్రాచలం - పోలవరం
 
 (బకింగ్ హామ్ కాలువ ద్వారా)
 
 కాకినాడ - సామర్లకోట - ఏలూరు - విజయవాడ - తాడేపల్లి - తెనాలి- బాపట్ల - నిజాంపట్నం - నెల్లూరు - చెన్నై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement