బీసీ–ఈకి మరో 6 శాతం కోటా ఇవ్వాలని సూచన
► తమిళనాడు తరహా విధానం అమలు చేయాలి
► వైవిధ్య సూచిక, సమాన అవకాశాల కమిషన్ ఏర్పాటు చేయాలి
► బీసీ–ఈలో ఇతర ముస్లిం వర్గాలను చేర్చడంపై ప్రత్యేక అధ్యయనం అవసరమని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన ముస్లిం తరగ తులతో కూడిన ‘బీసీ–ఈ’గ్రూపునకు మరో 6 శాతం రిజర్వేషన్ల కోటా ఇవ్వాలని రాష్ట్ర బీసీ కమిషన్ సిఫార్సు చేసింది. వీరికి ఇప్పటికే 4 శాతం రిజర్వేషన్ ఉన్నందున.. మొత్తంగా 10 శాతానికి పెంచాలని సూచించింది. అయితే బీసీ–ఈలో ఇతర ముస్లిం వర్గాలను చేర్చడంపై ప్రత్యేక అధ్యయనం అవసరమని స్పష్టం చేసింది. ఆర్థికంగా, సామాజి కంగా వెనకబడిన పలు వెనకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన నివేదికలో బీసీ కమిషన్ కీలక సిఫార్సులు చేసింది.
ప్రభుత్వం ఆదివారం ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపె ట్టింది. ‘‘ముస్లింలలోని వెనుకబడిన తరగతులకు బీసీ–ఈ కేటగిరీలో 12 శాతం రిజర్వేషన్లు కల్పిం చాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కనీసం 9 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని ఇప్పటికే సుధీర్ కమిషన్ సిఫార్సు చేసింది. ముస్లిం జనాభాలో 75.6 శాతం వెనుకబడిన తరగతుల కేటగిరీలోకి వస్తారని, మొత్తం జనాభాలో వారి ప్రాతినిధ్యం 9.6 శాతం ఉంటుందని సుధీర్ కమిష న్ గుర్తించింది. ఆ సిఫార్సులు అంగీకరించదగి నవని అభిప్రాయపడుతున్నాం. బీసీ–ఈ గ్రూపు నకు గత ప్రభుత్వం కల్పించిన 4 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. వాటికి అదనంగా మరో 6 % రిజర్వేషన్లు కల్పించాలని గట్టిగా సిఫార్సు చేస్తు న్నాం’’అని బీసీ కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది.
నివేదికలోని ప్రధాన అంశాలు
⇒ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని కోర్టు తీర్పులున్నా.. అసాధారణ పరిస్థితులుంటే పరిమితికి మించవచ్చనే వెసులు బాటూ ఉంది. ఇందుకు సామాజికంగా, విద్యా పరంగా వెనకబడిన తరగతుల గుర్తింపునకు సంబంధించి సరైన గణన ద్వారా సేకరించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండాలి.
⇒ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా నిష్పత్తి పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల తో పోల్చితే తెలంగాణ ప్రాంత జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికంగా ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లు కల్పించడం సమంజసమే.
⇒ రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా గణించదగ్గ సమా చారం ఆధారంగా విద్యా, ఉద్యోగాల్లో 50శాతం పరిమితి లేకుండా రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ నిబంధనలను పునః సమీక్షించాల్సిన అవసరముంది.
⇒ రిజర్వేషన్ల పెంపుపై తమిళనాడు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరించవచ్చు. తమిళనా డులో 85వ దశకం నుంచి 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ముస్లింలతో సహా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 69 శాతం రిజర్వేషన్లు కల్పించేం దుకు ఆ రాష్ట్ర శాసనసభలో సమగ్ర చట్టం (యాక్ట్ 45/94)ను ఆమోదించింది. కోర్టుల్లో సవాలుకు వీల్లేకుండా ఆ చట్టాన్ని 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్‌లో చేర్చారు. ఈ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చ డంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. కానీ తమిళనాడులో 69% రిజర్వేషన్ల అమలుకు ఈ చర్య రాజ్యాంగపర రక్షణ కల్పించింది.
⇒ తమిళనాడు తరహాలో తెలంగాణలో సైతం 50 పరిమితికి మించి రిజర్వేషన్లు అమలు చేసేందుకు శాసనసభలో ఓ చట్టాన్ని ఆమోదించి 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి.
⇒ సచార్, కుందూ కమిటీల సిఫార్సుల మేరకు రాష్ట్రంలో వైవిధ్య సూచిక (డైవర్సిటీ ఇండెక్స్) ఏర్పాటు చేయాలన్న సుధీర్ కమిషన్ సిఫార్సును సమర్థిస్తున్నాం. మానవ వనరుల కూర్పులో వైవిధ్యం ఆధారంగా రాష్ట్రంలోని ప్రతి సంస్థకు ర్యాంకింగ్స్ కల్పించాలి. రాష్ట్రంలోని అన్ని శాఖలు, సంస్థల్లో వైవిధ్య సూచికలు అమలు చేయాలి.
⇒ శిక్షణ, నియామకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో సమాన అవకాశాల కల్పన కోసం సమాన అవకాశాల కమిషన్ ఏర్పాటు చేయాలన్న సుధీర్ కమిషన్ సిఫార్సునూ సమర్థిస్తున్నాం.
⇒ ముస్లింలోని సయీద్, మిర్జా, ఖాన్, ఇతర గ్రూపులు తమను బీసీ–ఈ కేటగిరీలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని కోరాయి. బీసీ–బీ గ్రూపు కేటగిరీలో ఉన్న ముస్లింలలోని దూదేకుల, లద్దాఫ్, పింజరీ, నూర్‌బాషా వర్గాలు తమను బీసీ–ఈ గ్రూపులోకి మార్చాలని కోరాయి. ఈ రెండు విషయాల్లో ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. ప్రత్యేక అధ్యయనం, సర్వే అవసరమని బీసీ కమిషన్ భావిస్తోంది.
⇒ బీసీ–ఈ కేటగిరీ కోటా పెంచితే ఏ, బీ, సీ, డీ గ్రూపుల వారి విద్య, ఉద్యోగాలు, రాజకీయ కోటాపై ప్రభావం పడుతుందనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీసీల ప్రస్తుత రిజర్వేషన్లలో మార్పు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.