బీసీ కార్పొరేషన్లకు నిధులివ్వాలి: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు గత ఏడాదికి సంబంధించిన పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య కోరారు. సచివాల యంలో మంగళవారం కృష్ణయ్య బృందం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసింది.
కృష్ణయ్య మాట్లాడుతూ నిధులు విడుదల చేయకపోవడంతో బీసీలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇతర ఫెడరేషన్లకు నిధులు ఇస్తున్న ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేస్తామని ఈటల హామీ ఇచ్చారని కృష్ణయ్య చెప్పారు. గుజ్జ కృష్ణ, గోరిగే మల్లేశ్, సీఎం యాదవ్, జి.కృష్ణయాదవ్ పాల్గొన్నారు.