కేన్సర్‌పై అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి పది మందిలో ఒకరు కేన్సర్‌తో బాధపడుతుండగా, ప్రతి వంద మందిలో ఒకరు ఇదే జబ్బుతో మృతి చెందుతున్నారని, సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. యశోద కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన‘ట్రిపుల్ ఎఫ్’ రేడియో సర్జరీ యంత్రాన్ని ఆదివారమిక్కడ హోటల్ పార్క్‌హయత్‌లో సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేన్సర్ చికిత్సలో ట్రిపుల్ ఎఫ్ రేడియో సర్జరీ సాంకేతిక పరిజ్ఞానం ఓ నూతన అధ్యాయాన్ని సృష్టించిందన్నారు.
రోజుకు మూడు నిమిషాల చొప్పున కేవలం మూడు రోజుల్లోనే కేన్సర్‌ను నయం చేసే ఈ అత్యాధునిక పరిజ్ఞానాన్ని యశోద ఆస్పత్రి యాజమాన్యం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రజలు తమ ఆహారంలో చింతపండు ఎక్కువ వాడతారని, దీంతో ఇక్కడ కేన్సర్ కేసులు తక్కువ నమోద వుతున్నట్లు చిన్నప్పుడు ఓ పత్రికలో చదివానని, అయితే ఇందులో వాస్తవాలు వైద్యులే తేల్చాలన్నారు. ప్రతి జిల్లాకు ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేసి, ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. క్లీన్ తెలంగాణను భవిష్యత్తులో గ్రీన్ తెలంగాణగా మారుస్తామని, ఇందుకోసం 25 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 35 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్‌రావు, యశోద గ్రూప్ చైర్మన్ రవీందర్‌రావు, మైహోమ్ గ్రూప్స్ అధినేత రామేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.