చిరకాల ఆకాంక్ష నెరవేరింది: కేసీఆర్
* తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదంపై హర్షం
* దృఢ సంకల్పంతో ముందుకువెళ్లిన సోనియూగాంధీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా
* తెలంగాణకు మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు..
* పోరాడిన ప్రతి ఒక్కరికీ అభినందనలు
* ఇది ఒకరి ఓటమో.. మరొకరి విజయమో కాదు
* జరిగినదంతా మర్చిపోదాం.. అందరం కలసిమెలసి ముందుకు సాగుదాం.. హైదరాబాద్‌లో సీమాంధ్రులు సంతోషంగా ఉండొచ్చు
* తెలంగాణను ప్రగతిశీల రాష్ర్టంగా తీర్చిదిద్దుకుందాం
* రాజకీయ అంశాలు తరువాత మాట్లాడతా
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంపై టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు కావాలనే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లి కఠిన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం సహా బిల్లుకు మద్దతిచ్చిన బీజేపీ, ఇతర రాజకీయ పక్షాలన్నింటికీ కృతజ్ఞతలు చెప్పారు.
తెలంగాణ కోసం అహోరాత్రులు పనిచేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులందరికీ అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒకరి ఓటమో...మరొకరి విజయమో అనుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యమ సందర్భంలో వైషమ్యాలు తలెత్తి ఉండొచ్చని, వాటిని ఇంకా గుర్తుంచుకోవాల్సిన పనిలేదని చెప్పారు. అన్నీ మర్చిపోయి ఉభయ రాష్ట్రాల ప్రజలు కలసిమెలసి ముందుకు సాగాలని కోరారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులంతా తమవాళ్లేనని, వారిక్కడ సంతోషంగా జీవించవచ్చునని అన్నారు. రాజ్యసభలో గురువారం రాత్రి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదానంతరం కేసీఆర్ నివాసంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. నేతలు మిఠారుులు పంచుకుంటూ, బాణసంచా పేలుస్తూ ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. కేసీఆర్ రెండు చేతులు పెకైత్తి విజయ సంకేతాలు చూపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీలు కె.కేశవరావు, మందా జగన్నాథం, వివేక్ సహా టీఆర్‌ఎస్ నేతలతో కలసి మీడియాతో మాట్లాడారు. రాజకీయ అంశాలపై ప్రశ్నలేవీ అడగొద్దని మీడియాను అభ్యర్థించారు.
మరో రెండ్రోజులు ఢిల్లీలోనే ఉంటానని, వాటిపై అప్పుడు మాట్లాడతానని చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. సోనియాగాంధీకి తెలంగాణలోని 4 కోట్ల ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా. అలాగే ప్రధానమంత్రికి, హోంమంత్రి షిండేకు, ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి, లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలకు కృతజ్ఞతలు. బిల్లుకు మద్దతిచ్చిన మాయావతి, పవార్, లాలూప్రసాద్, పాశ్వాన్, అజిత్‌సింగ్, సీపీఐ పార్టీలకు పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నా. రాత్రనక, పగలనక, ఎండనక, వాననక అహోరాత్రులు తెలంగాణకోసం పనిచేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు. ఒక్క పిలుపిస్తే ఎప్పుడంటే అప్పుడు ముందుకొచ్చి పనిచేసిన కార్యకర్తలదే ఉద్యమంలో మహాపాత్ర. అటుకులు తిన్నా, పాదయాత్ర చేసినా ఎండలో వానలో పనిచేసిన కార్యకర్తల అపూర్వ శ్రమ మరువలేనిది. నేను రాజీనామా చేయాలని కోరితే గడ్డిపోచల్లా పదవులు వదిలేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు. వారి పట్టుదలా మరువలేనిది.
తెలంగాణ ప్రజలు అస్థిత్వం, స్వయంపాలన, ఆత్మగౌరవం కావాలనుకు ని సాధించుకున్నారు. ఉద్యమం సందర్భంలో ఇరుప్రాంతాల మధ్య వైషమ్యాలు తలెత్తి ఉండొచ్చు. గతంలో జరిగిన మంచి చెడ్డలు మర్చిపోయి ఉభయ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా కార్యాచరణ రూపొందించుకుందాం. పరస్పర సహకారంతో ముందుకు పోదాం. ప్రజలు ఎక్కడున్నా ప్రజలే. వారి అభివృద్ధే మాకు ముఖ్యం. తెలంగాణ అన్నిరకాలుగా అభివృద్ధి చెందాలి. ఉద్యమంలో అపూర్వపాత్ర పోషించిన తెలంగాణ ఉద్యోగులు, టీచర్లు, లెక్చరర్లు, అడ్వొకేట్లు, జర్నలిస్టులు, ఇంజ నీర్లు, విద్యార్థులు, కవులు, కళాకారులు... ఒక్కరేమిటి యావత్ తెలంగాణ సమాజానికి నా కృతజ్ఞతలు. వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకుపోయిన జేఏసీకి నా ధన్యవాదాలు. తెలంగాణ పండుగలైన దసరా, బతకమ్మ పండుగలనూ పక్కనపెట్టి సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మీరే నాకు ఊపిరిపోశారు. ఉద్యమం ఎప్పుడు తగ్గినా ముందుండి నడిపించారు.
తెలంగాణ కోసం అమరులైన యువకులకు ప్రత్యేకించి నివాళులు అర్పిస్తున్నా. వారి కుటుంబాలను ఆదుకుంటాం. ఉద్యమ భావజాలాన్ని అందించిన జయశంకర్ ఇప్పుడు లేకపోవడంతో(గద్గద స్వరంతో) బాధేస్తోంది. ఆయనుంటే ఎంత సంతోషించేవారో... కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధిస్తాననుకున్నా. కానీ ఈరోజు మహబూబ్‌నగర్ ప్రజలకు అదృష్టం దక్కింది. నన్ను గెలిపించిన అక్కడి ప్రజలకు ప్రత్యేక నమస్కారాలు. సోనియా, ప్రధాని, రాష్ట్రపతి, స్పీకర్, చైర్మన్లను స్వయంగా కలసి కృతజ్ఞతలు తెలపాల్సిన బాధ్యత నాపై ఉంది. తెలంగాణ సాధన జరిగింది. ఇక రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. అందరం అందులో భాగస్వాములమవుదాం. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుదాం. యువతకు ఉద్యోగాలు కల్పించాలి. హైదరాబాద్‌కు ఐటీఏఆర్ వచ్చింది కాబట్టి దానిని త్వరగా ఏర్పాటు చేసుకుందాం. అందరం కలిసి ముందుకు సాగుదాం. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని దేశంలోనే తెలంగాణను ప్రగతిశీల రాష్ర్టంగా తీర్చిదిద్దుదాం.