నట్టింట్లో కయ్యం
బీడీ పింఛన్ తెచ్చిన వైనం
అత్తాకోడళ్ల మధ్య వైరం
‘ఇంటికి ఒక్కరికే’ నిబంధనతో చిచ్చు
పల్లెల్లో ప్రతిరోజూ పంచాయితే..
నిబంధన సడలించాలని డిమాండ్
అత్తాకోడళ్లు ఇన్నాళ్లు కలిసే ఉన్నారు. కలోగంజో తాగి.. ఉన్న ఒక్క అర్ర ఇంట్లో గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చారు. ఇప్పుడు వాళ్ల మధ్య బీడీ పింఛన్ చిచ్చు పెడుతోంది. పింఛన్ దెబ్బకు అత్తాకోడళ్లు నిట్టనిలువుగా విడిపోయి కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఏళ్లకేళ్లుగా గుట్టుగా సాగిన సంసారాలు పింఛన్ పుణ్యమా అని బజారున పడుతున్నాయి.
సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వ గణతంత్ర దినోత్సవం కానుకగా బీడీ కార్మికులకు పింఛన్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద రూ. 1000 పింఛన్ ప్రకటించింది. ఏళ్లకేళ్లుగా బీడీలు చుట్టినా ఫలితం దక్కని కార్మికులకు ఈ పథకం వరంగా మారింది. అయితే ప్రతి కుటుంబంలో ఒకరు మాత్రమే పింఛన్ తీసుకునేందుకు అర్హులనే నిబంధన పెట్టింది. ఇదే నిబంధన అత్తాకోడళ్ల మధ్య వివాదానికి దారి తీస్తోంది. దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, మెదక్ నియోజకవర్గాల్లో ప్రతి కుటుంబంలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు బీడీ కార్మికులుగా పని చేస్తున్నారు.
జిల్లాలో దాదాపు 1.50 లక్షల మంది వరకు కార్మికులున్నారు. సుమారు 14 గంటల పాటు నిరంతరాయంగా బీడీలు చుడుతున్నారు. ప్రభుత్వం పీఎఫ్ నంబర్ ఉన్న వారినే అర్హులుగా గుర్తిస్తోంది. ఇక్కడే దాదాపు రెండొంతుల మంది బీడీ కార్మికులు దూరమయ్యారు. ఇక పీఎఫ్ ఉన్నప్పటికీ అదే ఇంటిలో మరొకరు పింఛన్ పొందుతున్నట్లయితే వారికి కూడా అర్హత ఉండదు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా 41,691 మందికి మాత్రమే బీడీ పింఛన్లు అందుతున్నాయి.
అత్తాకోడళ్ల మధ్య చిచ్చు..
సాధారణంగా గ్రామీణ ప్రాంతంలో సగటు జీవన ప్రమాణాలు చాలా తక్కువ. సొంతంగా ఇళ్లు కట్టుకునే స్తోమత లేక ఉన్న ఇంటిలోనే అన్ని కుటుంబాలు కలిసి కాపురం చేస్తాయి. వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులు కొడుకుల వద్దే కాలం వెళ్లదీస్తారు. సమగ్ర కుటుంబ సర్వే చేసిన రోజున తల్లిదండ్రులు ఏ కొడుకు దగ్గర ఉంటే ఆ కొడుకుతో కలిసే సమాచారం ఇచ్చారు. పింఛన్‌కు ఎంపికైన బీడీ కార్మికుల్లో దాదాపు 30 శాతం మందికి ఆసరా పథకం అడ్డంగా మారింది.
ఆ కుటుంబంలో ఉంటే అత్తకో.. మామకో పింఛన్ వస్తే బీడీ కార్మికురాలైన కోడలుకు పింఛన్ కోత పెడుతున్నారు. దీంతో కోడళ్లు బలవంతంగా అత్తామామలను బయటికి పంపుతున్నారు. లేదా వేరు కాపురా నికి సిద్ధమవుతున్నారు. చాలా గ్రామాల్లో ఇప్పటికే అత్తాకోడళ్ల పంచాయితీ రచ్చబండ మీదకు వస్తోంది. ఈ వయసులో నాకు పింఛన్ తప్ప ఇంకేం ఆధారం ఉందని వృద్ధురాలైన అత్త అంటుంటే..! నా పిల్లల భవిష్యత్తును ఆగమైందని కోడలు వాపోతోం ది. ఈ పంచాయితీ ఇటు కుటుంబానికి, అటు గ్రామ పెద్దలకు తలనొప్పిగా మారింది. బీడీ కార్మికుల విషయంలో ఇంటికి ఒక్కరే అనే నిబంధన సడలించాలని పలువురు కోరుతున్నారు.