కదంతొక్కిన బీడీ కార్మికులు
►బీడీ కంపెనీ బ్రాంచి కార్యాలయం ముట్టడి
►సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన
దిలావర్‌పూర్ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దిలావర్‌పూర్, కుంటాల, సారంగాపూర్, మామడ, లోకేశ్వరం, నిర్మల్ మండలాలకు చెందిన దాదాపు 2వేల మంది బీడీ కార్మికులు దిలావర్‌పూర్ మండలంలోని రాంపూర్‌లో శివాజీ బీడీ కంపెనీ బ్రాంచి కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజన్న మాట్లాడుతూ, శివాజీ బీడీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు మాత్రమే చెల్లిస్తూ పీఎఫ్ ఇవ్వకుండా శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారని ఆరోపించారు.
నిర్మల్ డివిజన్‌లోని 6 వేలకు పైగా ఉన్న కార్మికులకు నేటికీ పీఎఫ్ సౌకర్యం కలుగజేయకపోవడం శోచనీయమని అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీడీ కార్మికులకు రూ.1000 భృతి కూడా పీఎఫ్ లేని కారణంగా దక్కని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు వైద్యం, వారి పిల్లలకు ఉపకార వేతనాలు అందడం లేదని పేర్కొన్నారు. కార్మికులందరికీ పీఎఫ్ చెల్లుబాటయ్యేలా చూసి, ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ దిశగా అధికారులు, ప్రభుత్వం స్థానిక బీడీ కంపెనీపై ఒత్తిడి తేవాలని కోరారు. అనంతరం బ్రాంచి మేనేజరుకు వినతిపత్రం అందజేశారు. జిల్లా నాయకులు సుమేగ్, పీవోడబ్ల్యూ కార్యదర్శి కె.లక్ష్మి, నాయకులు హరిత, దేవక్క, అమ్మాయి, ఆయా మండలాల బీడీ కార్మికులు పాల్గొన్నారు.