మద్యం అమ్మకాలు సాగుతున్న సీతానగరంలోని రెస్టారెంట్ (ఇన్‌సెట్) పూరిపాకలో సిట్టింగ్
భద్రాచలం : ఏజెన్సీ ప్రాంతంలో బెల్ట్ షాపులు బార్లా తెరుచుకున్నాయి. సిండికేటైన వ్యాపారస్తుల కనుసన్నల్లోనే అక్రమ దందా సాగుతోంది. వీటికి అడ్డకట్ట వేసేందుకు ఎక్సైజ్ అధికారులు ఏమాత్రం స్పందించకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సిండికేట్ దందా’ అనే శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సర్వత్రా చర్చనీయాంశమైంది. భద్రాచలంతోపాటు జిల్లా అంతటా బెల్టు షాపుల దందా సాగుతోంది. భద్రాచలం పట్టణంతోపాటు దుమ్ముగూడెం మండలంలోని కొన్ని ప్రాంతాలను ‘సాక్షి’ పరిశీలించింది. భద్రాచలం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లోగల పాన్ షాపులో మద్యం విక్రయాలు జరిగాయి.
ఉదయ భాస్కర్ సినిమాహాల్ ముందు, చర్ల రోడ్‌లోని గాయత్రీ ఆలయం సమీపంలోని పాన్ షాపులు, కాలేజీ సెంటర్, పాత మార్కెట్, ఐటీడీఏ రోడ్‌లో కాలేజీ గ్రౌండ్ వెనుక గల పాన్ షాపుల్లో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఇదే విషయాన్ని నిఘా వర్గాలు సైతం ధృవీకరించినట్లుగా తెలిసింది. భద్రాచలం పట్టణంలో ప్రజానీకానికి ఇబ్బందికరంగా కొన్నిచోట్ల బెల్టు షాపులు నిర్వహణ సాగుతున్న విషయం వాస్తవమేనని నిఘా వర్గాలు సైతం ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. అయినప్పటికీ ఎక్సైజ్Œ అధికారులు తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుండంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెస్టారెంట్లలో అమ్మకాలు
ఫ్యామిలీ రెస్టారెంట్లుగా బోర్డులు తగిలించినచోట కూడా లోపల మద్యం అమ్మకాలు దర్జాగా సాగుతున్నాయి. భద్రాచలం–చర్ల రూట్‌లో దుమ్ముగూడెం మండలంలోని సీతానగరం వద్ద ఓ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో మద్యం విక్రయాలు భారీగా సాగుతున్నాయి. ఇక్కడ సిట్టింగ్ కూడా ఉంది. పర్ణశాల కుటీరానికి సమీపంలో ఉండటంతో తిరుగు ప్రయాణంలో వస్తున్న అనేకమంది ఇక్కడ మద్యం సేవిస్తున్నారు. ఈ రహదారిలో తరచూ జరుగుతున్న ప్రమాదాలకు కూడా ఈ మద్యం విక్రయాలే కారణమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దుమ్ముగూడెం మండలంలోని ముల్కపాడు సెంటర్‌లోగల పాన్ షాపులు.. సాయంత్రం వేళ మద్యం దుకాణాలుగా మారిపోతున్నాయి. సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పాన్ షాపుల వదంద వాహనాల రద్దీ కనిపిస్తోంది. భద్రాచలం పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో కూడా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.
క్వార్టర్ బాటిళ్ల కొరత..!
మద్యం దుకాణాల్లో ప్రస్తుతం క్వార్టర్ బాటిళ్ల విక్రయాలు నిలిపివేసి, అనుబంధంగా ఉన్న బెల్టు షాపులకు తరలిస్తున్నారని మద్యం ప్రియలు అంటున్నారు. మద్యం షాపుల్లోనైతే ఎంఆర్‌పీకి ఇవ్వాలనే ఒత్తిళ్లు వస్తున్నందున అధిక రేట్లకు విక్రయించేందుకని వాటిని బెల్టు షాపులకు తరలిస్తున్నారని, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మందు బాబులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడబడితే అక్కడ, చివరకు ఇళ్ల మధ్య కూడా ఏర్పాటు చేస్తున్న బెల్టు షాపులను నియంత్రించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment