పీవీకి భారతరత్న ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ఠీవిగా నిలిచిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మాజీ ప్రధాని పీవీ 93వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం శనివారం అధికారికంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ క్లిష్ట సమయంలో దేశ ప్రధానిగా పని చేసిన పీవీకి జాతీయస్థాయిలో దక్కాల్సినంత గౌరవం దక్కలేదని, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఇబ్బందికరమన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేతలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే 24 జిల్లాలు ఏర్పాటవుతున్నాయని, వాటిలో ఒక జిల్లాకు, ఒక యూనివర్సిటీకి పీవీ పేరును పెడతామని ప్రకటించారు. ట్యాంక్‌బండ్‌పై గుంపులో గోవిందా కాకుండా ప్రముఖ స్థలంలో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పీవీ రచనలు, సాహిత్యం, జీవితంలో ముఖ్యఘట్టాలతో స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఢిల్లీలోనూ పీవీకి మెమోరియల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ప్రకటించారు. పీవీతో తనకు వ్యక్తిగత సాన్నిహిత్యం లేకపోయినా.. ఆయన సాహిత్యంతో, రచనలతో దగ్గరితనం ఉందన్నారు. దేశంలో ఎక్కడాలేని సమయంలో భూసంస్కరణలను అమలుచేసిన ముఖ్యమంత్రి పీవీ అని, దాని కోసం పదవీచ్యుతుడిని చేస్తామన్నా బెదరకుండా పేదలకు, అట్టడుగున ఉన్న దళితుల అభివృద్ధికోసం పనిచేశాడన్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ పీవీ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. పీవీ ఎత్తుగడలు, భాషా ప్రావీ ణ్యం భావితరాలకు ఆదర్శనీయమన్నారు. అలాం టి వ్యక్తి పువ్వుల్లో పూవుగా మిగిలిపోతాడంటూ గవర్నర్ నరసింహన్ ఓ కవితను చదివి వినిపించారు. పీవీ పేరిట హెర్బల్ గార్డెన్‌ను, ఫోటో ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి మాట్లాడుతూ పీవీ జయంతి సభను నిర్వహిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ పీవీ అనుభవాలు భావితరాలకు ఆదర్శంగా ఉంటాయన్నారు. పీవీ కుమార్తె వాణి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పేదలకు అన్నదానం చేశారు.
కాంగ్రెస్ పట్టించుకోని తెలంగాణ బిడ్డ పీవీ
హైదరాబాద్: దేశాన్ని అస్థిర స్థితి నుంచి గట్టెక్కించి ఐదేళ్లు స్థిర పాలన సాగించిన గొప్పవ్యక్తి మాజీ ప్రధాని పీవీ అని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. శనివారం తెలుగు అకాడమీలో పీవీ 93వ జయంతి ఘనంగా జరిగింది. ‘తెలంగాణ సాయు ధ పోరాటం, ప్రధానమంత్రి పీవీ నరసింహారావు’ అనే గ్రంథాలను స్పీకర్ ఆవిష్కరించారు. తెలుగు అకాడమీ డెరైక్టర్ ఆచార్య కె.యాదగిరి, ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య, ప్రముఖ పాత్రికేయులు టంకశాల అశోక్, గ్రంథ రచయితలు డాక్టర్ ఎం.ఎల్. నరసింహారావు, వి. రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.