- కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదిక
- రెండు, మూడు రోజుల్లో పరిహారం మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు 2.24 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు పం ట నష్టం అంచనాల కసరత్తు చేపడుతున్నా పార్లమెంటు సమావేశాలున్నందున కేంద్ర యంత్రాంగం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తాజా అంచనాలు, నష్టం వివరాలను పంపినట్లు వ్యవసాయశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర బృందం రాష్ట్రానికి రానుందని... వీలైనంత త్వరగా రైతులకు నష్టపరిహారం ఇప్పించేందుకు కృషిచేస్తున్నామని ఆ అధికారి వెల్లడించారు. పరిహారానికి సంబంధించిన అంశంపై పూర్తిస్థాయి మార్గదర్శకాలను 2, 3 రోజుల్లో విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలిసింది. అలాగే కేంద్రం ఇచ్చే నష్ట పరిహారం లెక్కలకు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారం లెక్కలకు తేడా లు ఉండటంతో వాటిని సవరించే అవకాశాలున్నట్లు విపత్తు నిర్వహణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
1.39 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటల నష్టం
ఎడతెరిపి లేని వర్షాలు, వడగళ్ల వానలతో రాష్ట్రవ్యాప్తంగా 2,24,544 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ, ఉద్యానశాఖలు తాజాగా అంచనా వేశా యి. అందులో వ్యవసాయ పంటలు 1,39,512 ఎకరాల్లో, 85,032 ఎకరాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆయా శాఖలు వెల్లడించాయి. అయితే ఇవి అంచనా వేసిన లెక్కలేనని... ప్రతీ గ్రా మాన్ని పరిశీలించి పూర్తిస్థాయి సర్వే నిర్వహించాక ఆ లెక్కలు ఇంకా పెరగవచ్చని ఓ కీలకాధికారి వ్యాఖ్యానించారు. ఈ నెల 22 నాటికి జిల్లాల నుంచి పూర్తిస్థాయి నివేదిక వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. వ్యవసాయ పంటల్లో ఏకంగా 93,827 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటల్లో 70,371 ఎకరాల మేర మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో పంటలకు అధిక నష్టం వాటిల్లినట్లు లెక్కలు చెబుతున్నాయి.