
సాక్షి, ఖమ్మం : వివిధ రకాల ఆన్‌లైన్ సేవలు అందిస్తున్న మీ సేవ కేంద్రాలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకనుగుణంగా సరికొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. ఇప్పటి వరకు మీ సేవ కేంద్రాలను పొందిన వారిలో ఇతరులు నిర్వహించడం, అధికంగా రుసుములు వసూలు చేయడం, పని వేళల్లో తేడాలు..ఇలా రకరకాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వీటికి కళ్లెం వేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. కొన్నిచోట్ల మీసేవ కేంద్రాలను పొందిన వారు ఇతరులకు వాటి నిర్వహణను అప్పగించారు. తమది కాదన్నట్లుగా వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సంఘటనలూ వెలుగు చూశాయి. ఇకపై ఇటువంటి వారికి కళ్లెం పడనున్నది. సరికొత్తగా బయోమెట్రిక్ నూతన విధానాన్ని అమలు చేయబోతున్నారు. మీసేవ కేంద్రం తెరవగానే నిర్వాహకుడు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. దీంతో వేరే వారు కేంద్రాలను నిర్వహించేందుకు వీలు పడదు.
గతంలో ఇతరుల పేరిట నిర్వహించే దుకాణాలు ఇక మూసివేయాల్సిందే. జిల్లాలో సుమారు 30వరకు బినామీల పేర్ల మీద నడుస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని 209 మీసేవ కేంద్రాల్లో ఇప్పటికే బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశారు. మీ సేవ కేంద్రం యజమానితో పాటు ఒక ఆపరేటర్ బయోమెట్రిక్ విధానంలో ఆన్‌లైన్ సేవలు అందించేలా ప్రోగ్రాం పూర్తయింది. బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయగానే మీ సేవ నిర్వాహకుడు రిజిస్టర్ చేసుకున్న సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేస్తేనే ఆన్‌లైన్ సేవలు కొనసాగనున్నాయి. నూతన విధానంతో ఆపరేటర్లు పొరపాటు చేశారనే కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. తద్వారా ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందడంతో పాటు బినామీలకు చెక్ పడనున్నది.
పారదర్శకంగా సేవలు..
రాష్ట్ర ప్రభుత్వం మీసేవ కేంద్రాల్లో పారదర్శకంగా సేవలను అందించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం వల్ల మెరుగైన సేవలను అందించనున్నాం. ఇప్పటికే అన్ని మీసేవ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నాం.
– దుర్గాప్రసాద్, ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment