
బాబు ప్రమేయాన్ని నమ్ముతున్నాం
- ఓటుకు నోటు స్కాంపై కిషన్‌రెడ్డి
- ఆయన ప్రమేయం టేపులతో సహా ప్రజల ముందు కనిపిస్తోంది
- దీనిపై ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కమిటీకి నివేదిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కుంభకోణంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయమున్నట్లు టేపులతో సహా ప్రజల ముందు కనిపిస్తోందని... దాన్ని తాము కూడా విశ్వసిస్తున్నట్లు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోవాల్సిందేనని, తప్పు చేసిన వారిని కేంద్ర ప్రభుత్వం కాపాడబోదని స్పష్టం చేశారు. దోషులుగా ఎవరు తేలితే వారు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు.
పార్టీ నేతలు ఎస్.మల్లారెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డిలతో కలసి శనివారం విలేకరుల సమావేశంలో, అనంతరం ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఓటుకు నోటు కేసు విషయమై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు తమ పార్టీ కేంద్ర కమిటీకి నివేదిస్తున్నట్లు తెలిపారు. అలాగే కేంద్రం కూడా నివేదికలు తెప్పించుకుంటుందని, ఈ విషయంలో చంద్రబాబు, కేసీఆర్ ఇచ్చే నివేదికలపై ఆధారపడటంలేదన్నారు. ఈ కేసు విషయమై కేంద్రం ఎక్కడా తొందరపాటుకు గురికాకుండా విచక్షణతో వ్యవహరిస్తోందన్నారు.
గవర్నర్ కూడా ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు పంపుతున్నారన్నారు. పార్టీపరంగా తాము చెప్పాల్సింది చెబుతున్నట్లు వివరించారు. అంతిమంగా తప్పు ఎవరూ చేసినా బీజేపీ ఉపేక్షించబోదని, అలాంటి వారికి భరోసా ఇవ్వబోమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే కొన్ని పార్టీల నాయకులు వారికి నచ్చిన మాదిరిగా మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారంటూ పరోక్షంగా టీడీపీని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కేసులో అంతిమంగా న్యాయం వెలువడుతుందన్నారు.
కాగా, ఈ కేసును కొన్ని రాజకీయ పార్టీలు ప్రాంతాలు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వాడుతున్నాయని... దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. రాజకీయంగా ప్రజలను విద్వేషపూరితం చేసి పబ్బం గడుపుకునే పరిస్థితి కల్పించడం మంచిదికాదన్నారు.
యోగాను వ్యతిరేకించడం తగదు....
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లాం దేశాలు కూడా యోగాను అభ్యసించాలని నిర్ణయిస్తుంటే ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రం రాష్ట్రంలో యోగాను వ్యతిరేకించడం తగదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. యోగా మతపరమైన కార్యక్రమం కాదని, యోగాకు మతం రంగు పులమరాదని సూచించారు.