తెలంగాణలో అమిత్ షా పర్యటన ఖరారు
- ఈ నెల 23, 24, 25 తేదీల్లో పర్యటన ఖరారు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వెల్లడి
న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఖరారైంది. ఆయన ఈ నెల 23, 24, 25 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నట్టు తెలిపారు. మతపర మైన రిజర్వేషన్లను అముల చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పార్టీ బలోపేతానికి అనేక అవకాశాలు ఉన్నాయని, ఈ విషయాలపై జాతీయ అధ్యక్షుడితో చర్చించామని, దానికి అనుగుణంగా పార్టీ పటిష్టతకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ఆయన తెలిపారు.
బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత నందీశ్వర్ గౌడ్..
కాంగ్రెస్ సీనియర్ నేత, పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సోమవారం బీజేపీలో చేరారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్యణ్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. నోట్ల రద్దు, బీసీ కమిషన్‌కు రాజ్యంగబద్ధ హోదా కల్పించడంలాంటి నిర్ణయాలపట్ల ఆకర్షితుడినై తాను బీజేపీలో చేరిన ట్టు నందీశ్వర్ గౌడ్ తెలిపారు.
బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించే విషయంలో లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినా.. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ వివిధ కారణాలు చూపుతూ బిల్లును ఆడ్డుకోవడం బాధించిందన్నారు. దేశంలో అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందని భావించి పార్టీలో చేరినట్టు ఆయన తెలిపారు.