
గ్రేటర్‌పై బీజేపీ జెండా ఎగురవే యాలి
సాక్షి, హైదరాబాద్: రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ కార్యాలయంపై బీజేపీ జెండా ఎగురవేయాలని, అందుకు పార్టీ కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గోల్నాకలోని అశోక ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం నిర్వహించిన పార్టీ గ్రేటర్ డివిజన్ ఇన్‌చార్జీల సమావేశంలో వారు ప్రసంగించారు. ఈసారి నగరంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని, టీఆర్‌ఎస్-ఎంఐఎం కూటమిని దీటుగా ఎదుర్కోవాలని సూచించారు.
గ్రేటర్‌లోని అన్ని డివిజన్లలో ఓట్లు సమానంగా ఉండేలా డీలిమిటేషన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కోర్టు ఆదేశాల మేరకైనా ఓట్లను విభజించి డివిజన్‌లను ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ గ్రేటర్ అధ్యక్షులు బి.వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్లు బంగారి ప్రకాశ్, సహదేవ్‌యాదవ్, జితేందర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణజ్యోతి, ప్రధాన కార్యదర్శులు భావర్‌లాల్‌వర్మ, రాజశేఖరరెడ్డి, ఉమామహేందర్, బాలప్రకాశ్, శ్యాంసుందర్‌గౌడ్, నందు, సీకే శంకర్‌రావు, రామన్‌గౌడ్, రవిప్రసాద్‌గౌడ్, రాహుల్‌చంద్ర, మహేందర్ వ్యాస్, జయశ్రీ, బండారి రాధిక, బి.నరసింహ, మాచెర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.