'ఇది చేతల ప్రభుత్వం కాదు... కోతల ప్రభుత్వం'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతి చిన్న విషయానికి కేంద్రాన్ని నిందించడం సరికాదని బీజేఎల్పీ నేత డా. కె.లక్ష్మణ్ ఆదివారం హైదరాబాద్లో అభిప్రాయపడ్డారు. గతంలో తెలంగాణ అభివృద్ధి కోసం అఖిలపక్షాన్ని సంప్రదిస్తానని చెప్పిన కేసీఆర్... ఆ విషయాన్ని ఎందుకు మరిచిపోయారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇది చేతల ప్రభుత్వం కాదని... కోతల ప్రభుత్వమని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో వివిధ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుదోవపట్టిస్తుందని లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ కోరత తీర్చే క్రమంలో ఛత్తీస్గఢ్ సర్కార్తో మాట్లాడేందుకు 4 నెలలు సమయం కేసీఆర్ తీసుకున్నారని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చొరవతోనే ఎయిమ్స్, హార్టికల్చర్, ట్రైబల్ యూనివర్శిటీలు వచ్చాయన్న సంగతి విస్మరించరాదని కేసీఆర్కు లక్షణ్ హితవు పలికారు.