- కలెక్టరేట్‌లోకి చొరబడేందుకు విఫలయత్నం
- తిప్పికొట్టిన పోలీసులు
- పోలీసుల కళ్లుగప్పి జెండా ఎగురవేత
- నేతల అరెస్టు, విడుదల
హన్మకొండ సిటీ : బీజేపీ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్‌లో జాతీయజెండా ఎగురవేసేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు విఫలయత్నం చేశారు. కొందరు నాయకులు, కార్యకర్తలు గోడదూకి లోపలికి ప్రవేశించారు. వీరిని పట్టుకుని పోలీసులు బయటకు పంపారు. అయినా మరోసారి ప్రయత్నించిన నాయకులు ఎట్టకేలకు కలెక్టరేట్‌లో జాతీయజెండా ఎగురవేశారు. అంతకుముందు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు.
అమరవీరుల స్థూపానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్, పార్టీ సీనియర్ నాయకులు పూలమాలలు వేసి, మౌనం పాటించి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరారు. దీనిని ముందే ఊహించిన పోలీసులు కలెక్టరేట్ గేట్లు మూసి బారికేడ్లు, గోడలపై ముళ్లకంచె ఏర్పాటు చేశారు. రోప్‌పార్టీలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హన్మకొండ డీఎస్పీ అధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బీజేపీ ర్యాలీ కలెక్టర్ బంగ్లా వద్దకు రాగానే రోప్‌పార్టీ పోలీసులు అడ్డుకుని తెలంగాణ అమరుల కీర్తిస్థూపం వైపు మళ్లించేందుకు ప్రయత్నించారు.
పోలీసుల వలయాన్ని ఛే దించుకుని నాయకులు, కార్యకర్తలు ముందుకు పరిగెత్తారు. అయితే అప్పటికే కలెక్టరేట్ వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో కొందరు పోలీసుల కళ్లు గప్పి కలెక్టరేట్ లోపలికి ప్రవేశించారు. లోపలున్న పోలీసులు వీరిని అడ్డుకుని బయటకు పంపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రావుల కిషన్ పోలీసుల కళ్లుగప్పి లోపలికి ప్రవేశించి కలెక్టరేట్‌లో జాతీయజెండా ఎగురవేసే స్తంభానికి కర్రను బిగించి జెండా ఎగురవేశారు.
పోలీసులు వెంటనే దీనిని తొలగించారు. అనంతరం ఉద్రిక్త వాతావరణం మధ్యే నాయకులను అరెస్టు చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కార్యదర్శి రావు పద్మ, తెలంగాణ ఉద్యమ జాయింట్ కన్వీనర్లు డాక్టర్ టి.విజయలక్ష్మి, నాగపురి రాజమౌళి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్, నాయకులు డాక్టర్ విజయచందర్‌రెడ్డి, వి.జయపాల్, మందాడి సత్యనారాయణరెడ్డి, చాడ శ్రీనివాస్‌రెడ్డి, రావు అమరేందర్‌రెడ్డి, శ్రీరాముల మురళీమనోహర్, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, విష్ణువర్ధన్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, రాజేందర్, నరసింహరావు, హరిశ్చంద్రగుప్తా, నలుసాని రాంరెడ్డి, జలగం రంజిత్, బండి సాంబయ్య, బన్న ప్రభాకర్ పాల్గొన్నారు.
జెండా అంటే భయమెందుకు..
జాతీయ జెండా ఎగురవేయమంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులకు అంత భయమెందుకని బీజే పీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు ప్రశ్నించారు. ర్యాలీ ప్రారంభానికి ముం దు ఆయన మాట్లాడారు. నైజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజును స్వాతంత్య్ర దినంగా అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుంటే రాష్ట్రంగా ఏర్పాటయ్యాక కూడా తెలంగాణలో ఎం దుకు అధికారికంగా జరపడం లేదని ప్రశ్నించారు.
బీజేపీ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
Published Thu, Sep 18 2014 2:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement