విద్యార్థుల జీవితాలతో చెలగాటమొద్దు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్
రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ నిర్ణయం అనైతికం
రైతు రుణ మాఫీపై వెంటనే స్పష్టతనివ ్వండి
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల చెల్లింపుల విషయంలో తండ్రీకొడుకు (కేసీఆర్, కేటీఆర్)లు పూటకో మాట మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్యను అమలు చేస్తామని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధికార పగ్గాలు చేపట్టాక 14 లక్షల మంది విద్యార్థుల చదువును అటకెక్కించిందని విమర్శించారు. బుధవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్, అధికార ప్రతినిధులు ప్రకాష్‌రెడ్డి, కుమార్‌తో కలసి మాట్లాడారు. కీలక సమయంలో రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ, అంబేద్కర్ యూనివర్సిటీలకు వైస్ చైర్మన్లను సైతం నియమించలేని దుస్థితి నెలకొం దన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గొడవలతో విద్యార్థులను బలి చేయవద్దని కిషన్‌రెడ్డి కోరారు. బకాయిపడిన రూ.1250 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పడు చెల్లిస్తుందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1956 ముందు ఇక్కడ పుట్టినవారికి మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని ప్రభుత్వ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో స్థానికతను చూశారా.. అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. లక్ష రూపాయల్లోపు రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఈ విషయంలో నాన్చుడు ధోరణి అవలంబించడం తగదని ఆయన అన్నారు.