ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నా.. ఇంకా బీజేపీ క్షేత్రస్థాయి బలోపేతానికే ప్రాధాన్యత ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారితో సమావేశాలు నిర్వహించడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తోంది. కొత్త ఓటర్లైన యువతను ఆకట్టుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని, తద్వార అసెంబ్లీ ఎన్నికలతో పాటు, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీకి కలిసొస్తుందని భావిస్తోంది.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నప్పటికీ.. భారతీయ జనతా పార్టీ మాత్రం ఇంకా సంస్థాగత నిర్మాణంపైనే దృష్టి సారిస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి., ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసినప్పటికీ.. బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల ప్రకటన అటుంచితే, పార్టీ క్షేత్రస్థాయి బలోపేతానికే ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అధినాయకత్వం పార్టీ శ్రేణులను ఆదేశించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారితో సమావేశాలు నిర్వహించడం ద్వారా రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావిస్తోంది.
ఈ మేరకు ఆయా నియోజకవర్గాల టికెట్లు ఆశిస్తున్న నేతలను ఆదేశించింది. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర నాయ కత్వం చేపట్టింది. హైదరాబాద్‌లోని శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్‌లో అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఉమ్మడి జిల్లా పరిధిలో తొమ్మిది నియోజకవర్గాల నుంచి ఎనిమిది మంది సభ్యులతో కూడిన కోర్ కమిటీ సమావేశమైంది. ఈసందర్భంగా ఆయా నియోజకవర్గాల బీజేపీ టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకు ప్రత్యేకంగా ఆదేశాలిచ్చింది. కేంద్ర ప్రభు త్వ నిధులతో అమలు చేసిన పలు పథకాలతో ఆ పార్టీకి పెద్దగా మైలేజీ రాలేదని భావిస్తున్న బీజేపీ ఇప్పుడు ఆ పథకాల లబ్ధిదారులను కలిసి వివరించే ప్రయత్నం చేయాలని భావిస్తోంది.
ఇందుకోసం ఆయా పథకాల లబ్ధిదారులతో వీలైతే మం డల, నియోజకవర్గ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకం అమలు చేస్తే.. ఇదే తరహాలో కేంద్ర నిధులతో ఉజ్వల పథకం కూడా అమలైంది. నిజామాబాద్ జిల్లాలో సుమారు 11,300 మంది, కామారెడ్డి జిల్లాలో సుమారు 8000 మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఉపాధి హామీ లబ్ధిదారుల వంటి వారితో సమావేశాలు నిర్వహించ డం ద్వారా ఎన్నికల్లో ఓట్లు రాల్చుకోవచ్చనే ప్రయత్నం చేయాలని అభ్యర్థులను ఆదేశించింది. కానీ ఈ దిశగా సమావేశాలు నిర్వహించడానికి ఆ పార్టీ నేతలు మాత్రం మొగ్గు చూపడం లేదు. మిగితా పార్టీల అభ్యర్థుల్లాగే ర్యాలీల వంటి కార్యక్రమాలకే పరిమితమవుతున్నారు.
యువతపై గురి..
కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారిపైనా బీజేపీ గురి పెట్టాలని భావిస్తోంది. 18 సం వత్సరాలు నిండిన వారు ఫారం–6 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ యువతను తమ పార్టీ వైపు తిప్పుకునే కార్యక్రమాలకు శ్రీకా రం చుట్టాలని నిర్ణయించింది. యువతను ఆకటు ్టకోవడం ద్వారా ఈ ఎన్నికలతో పాటు, రానున్న పార్లమెంట్ స్థానాలకు జరిగే ఎన్నికల్లో కూడా పార్టీకి కలిసొస్తుందని భావిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో సుమారు 1.10 లక్షల మంది, కామారెడ్డి జిల్లాలో సుమారు 39,000 మంది కొత్తగా ఓటరు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో యువ తే ఎక్కువగా ఉంది. గ్రామాల వారీగా యువతతో సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది.
మొత్తం మీద యువతను ఆకట్టుకోవడం కోసం కార్యక్రమాలు చేయాలని అభ్యర్థులను ఆదేశిం చారు. కానీ జిల్లా నాయకత్వం ఈ దిశగా కార్యచరణ చేయకపోవడం పట్ల రాష్ట్ర నాయకత్వం అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు, మూడు నియోజకవర్గాల్లో మినహా మిగితా చోట్ల కేవలం మొక్కుబడి కార్యక్రమాలకే పార్టీ నేతలు పరిమితయ్యా రు. తరచూ ప్రెస్‌మీట్లు మినహా పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలను చేపట్టిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తుంటే పార్టీ ఆదేశాలు ఏ మేరకు కార్యరూపం దాల్చుతుందనేది ప్రశ్నార్థకంగా తయారైందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment