
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలా పడిపోయి, నిరాశ నిస్పృహలకు గురైన కేడర్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నాల్లో బీజేపీ నాయకత్వం నిమగ్నమైంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు లోక్‌సభ ఎన్నికల కల్లా మారతాయని కార్యకర్తల్లో మనోధైర్యం కల్పిస్తున్నారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నాయకత్వం అప్రమత్తమైంది.
లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉందని, నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే దేశవ్యాప్తంగా బీజేపీని గెలిపిస్తాయనే విశ్వాసాన్ని కలిగించేందుకు ముఖ్యనాయకులు సిద్ధమవుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో కంగుతిన్న కార్యకర్తలు నైరాశ్యం నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టవచ్చని బీజేపీ నేత ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.
బీజేపీ చేస్తోందని చెప్పాలి...
ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గభేటీలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు అమిత్‌షా కేడర్‌లో కొత్త ధైర్యాన్ని, విశ్వాసాన్ని నూరిపోసే ప్రయత్నం చేశారు. తెలంగాణకు ప్రత్యేక దిశానిర్దేశం ఏమీ చేయకపోయినా, ప్రజాకూటమి పేరిట కాంగ్రెస్ చేసిన ఎన్నికల ప్రయోగం విఫలం కావడం గురించి ప్రత్యేకంగా ఉదహరించారు. జాతీయస్థాయిలో వివిధ రాజకీయపక్షాలు, ›ప్రాంతీయపార్టీలను కలుపుకుని పోయేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నం కూడా ఇదే విధంగా విఫలప్రయోగంగా మారుతుందనే ధీమాను బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో కల్పించే ప్రయత్నం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల వల్ల తెలంగాణసహా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది లబ్ధి పొందుతున్నా, వాటిని బీజేపీ చేపడుతోందన్న విషయం ప్రజలకు చేరడంలేదని జాతీయ నాయకత్వం అభిప్రాయపడింది. ఉజ్వల స్కీమ్ ద్వారా ఎల్‌పీజీ సిలిండర్లు, జన్‌ధన్ పథకం ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్లు, ఇతర రూపాల్లో ప్రత్యక్షంగా సొమ్ము వచ్చి చేరడం, జీఎస్టీ అమల్లోకి వచ్చాక మధ్యతరగతి, వ్యాపార వర్గాలకు ప్రయోజనం కలగడం వంటి వాటిపై విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్రనాయకత్వాలను నిర్దేశించింది.
ప్రధాన టార్గెట్ కాంగ్రెస్సే...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజాఫ్రంట్ కూటమి ప్రయోగం విఫలమైన తీరుపై పెద్దఎత్తున ప్రచారం చేయాలని రాష్ట్ర నాయకత్వాలను జాతీయపార్టీ ఆదేశించింది. అవినీతి తదితర అంశాలపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించింది. స్థానిక సమస్యలతోపాటు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నందున మూడు రాష్ట్రాల్లో బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసిందని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్సే ప్రధాన శత్రువని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం తిరోగమనంలోకి ప్రయాణిస్తుందని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని నిర్దేశించింది.
Comments
Please login to add a commentAdd a comment