మండుతున్న ఎండలు
నల్లగొండలో 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత
రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు 205 మంది మృతి
ఏపీలో వడదెబ్బకు 341 మంది మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు ఇంకా మండుతూనే ఉన్నాయి. రెండ్రోజులు తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా మంగళవారం మరింత పెరిగాయి. రాష్ట్రంలోకెల్లా నల్లగొండలో 45.8 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రామగుండంలో 44.5, నిజామాబాద్‌లో 44.4, ఆదిలాబాద్‌లో 44.3, వరంగల్‌లో 42, హైదరాబాద్‌లో 42.8, అశ్వారావుపేటలో 43.4, జగిత్యాలలో 42.3, కంపాసాగర్‌లో 43.8, మహబూబ్‌నగర్‌లో 43, రుద్రూర్‌లో 42, సంగారెడ్డిలో 42, తాండూరులో 42.2, మెదక్‌లో 41.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు 205 మంది మృతిచెందారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలలో 12 రోజుల ఆడ శిశువు వడదెబ్బతో మృతి చెందింది.
జిల్లాలవారీగా చూస్తే నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 55 మంది మరణించగా వరంగల్ జిల్లాలో 49 మంది, ఖమ్మం జిల్లాలో 41 మంది, కరీంనగర్ జిల్లాలో 23 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో తొమ్మిది మంది, మెదక్ జిల్లాలో ఎనిమిది మంది, హైదరాబాద్‌లో ఏడుగురు, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆరుగురు చొప్పున, నిజామాబాద్ జిల్లాలో ఒకరు మృతిచెందారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం వడదెబ్బ బారిన పడి 341 మంది మరణించారు. మరో 24 గంటల తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ నెల 28 నుంచి ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.