అటకెక్కిన బోధన్‌ స్కాం | Bodhan commercial tax department was scammed | Sakshi
Sakshi News home page

అటకెక్కిన బోధన్‌ స్కాం

Published Wed, Jun 14 2017 1:01 AM | Last Updated on Wed, Apr 3 2019 5:38 PM

అటకెక్కిన బోధన్‌ స్కాం - Sakshi

అటకెక్కిన బోధన్‌ స్కాం

► అమాత్యుడి జోక్యంతో నిలిచిన దర్యాప్తు

►ఫలించిన కమర్షియల్‌ వర్గాల ఒత్తిడి మంత్రం
►ఆపేయాలంటూ ప్రభుత్వం నుంచి సీఐడీకి ఆదేశం
►అరెస్ట్‌లు ఆపి.. చార్జిషీట్‌తో సరిపెట్టేందుకు యత్నాలు
►అసలు దొంగలను వదిలేశారంటూ సర్వత్రా విమర్శలు
►తమను బలి చేశారంటున్న కింది స్థాయి అధికారులు


సాక్షి, హైదరాబాద్‌
బోధన్‌ వాణిజ్య పన్నుల శాఖలో వెలుగుచూసిన స్కాం అటకెక్కినట్టే కనిపిస్తోంది! ఇప్పటిదాకా అక్రమార్కుల చుట్టూ ఉచ్చు బిగిస్తూ సాగిన దర్యాప్తు ఇప్పుడు ఉసూరుమంటోంది. ఓ అమాత్యుడి పైరవీనే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల వద్ద ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించినట్టుగా కనిపిస్తున్నాయి. అందుకే 15 రోజులుగా ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. వందల కోట్లు కొల్లగొట్టిన ఈ స్కాం కూడా అన్ని కేసుల మాదిరే కోల్డ్‌స్టోరేజీలోకి వెళ్లినట్టేనని అటు వాణిజ్య పన్నుల శాఖ, ఇటు సీఐడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మేలో స్పీడ్‌.. జూన్‌లో కళ్లెం..
గతేడాది డిసెంబర్‌లో వెలుగులోకి వచ్చిన బోధన్‌ నకిలీ చలాన్ల స్కాం మార్చిలో సీఐడీ చేతికి వచ్చింది. మార్చి, ఏప్రిల్‌లో తూతూమంత్రంగా సాగిన విచారణ కాస్తా మే వచ్చేసరికి హైస్పీడ్‌లో దూసుకెళ్లింది. డిప్యూటీ కమిషనర్లు, ట్యాక్స్‌ అధికారులు, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్‌ అధికారులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్లు, కీలక సూత్రదారులందరినీ కటకటాల్లోకి నెట్టేలా దర్యాప్తు సాగింది. ఈ కేసులో ఇక మిగిలింది కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులే కావడంతో కేసు దర్యాప్తును ప్రభావితం చేసే చర్యలు మొదలయ్యాయి. జూన్‌ రాగానే కేసు పూర్తిగా పక్కనబడింది. హైస్పీడ్‌తో నడిచిన దర్యాప్తు కాస్తా నత్తనడకన సాగుతోంది.

ప్రభుత్వంపై ఒత్తిడి..
2005 నుంచి 2014 వరకు సాగిన నకిలీ చలాన్ల దందాలో బోధన్‌ నుంచి హైదరాబాద్‌లోని ఉన్నతాధికారుల వరకు భాగస్వామ్యం ఉన్నట్టు తేలింది. ఇందులో భాగంగా నిజామాబాద్‌లో గతంలో పనిచేసిన అధికారులను సీఐడీ అరెస్ట్‌ చేసింది. ఏసీటీవో, డిప్యూటీ కమిషనర్ల నుంచి పైస్థాయిలో వసూళ్లు చేసిన ఇతర ఉన్నతాధికారులను అరెస్ట్‌ చేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులు మంత్రుల చుట్టూ చక్కర్లు కొట్టారు.

ఈ కేసులో తాము అరెస్ట్‌ కాకుండా చూడాలని వేడుకున్నారు. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ అంటే అవినీతికి కేరాఫ్‌ అన్నట్టుగా ముద్ర పడిందని, అక్కడ పనిచేసేందుకు ఏ అధికారి, సిబ్బంది ఇష్టపూర్వకంగా లేరంటూ కీలకమైన ఓ మంత్రిపై ఒత్తిడి పెంచారు. అంతటితో ఆగని అధికారులు.. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ధర్నాకు వెళ్తామని తెగేసి చెప్పారు. దీంతో చేసేదేమి లేక సదరు మంత్రి ప్రభుత్వ పెద్దల వద్ద లాబీయింగ్‌కు ఒప్పుకున్నారు. అనుకున్నట్టుగానే మంత్రి కేసులో చక్రం తిప్పారు.

ఇక చాలు ఆపండి...
కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీకి ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ‘స్కాం మొత్తం బయటపడింది కదా.. క్రియాశీలక పాత్ర పోషించిన వారిని అరెస్ట్‌ చేశారుగా.. ఇక ఆపేయ్యండి.. చేసింది చాలు..’ అని ఆదేశాలు రావడంతో కేసును సీఐడీ పక్కనపెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. స్కాం జరిగిన తీరు తెన్నులు, నకిలీ చలాన్లు, వాటి ఆడిటింగ్‌ను కాగ్‌కు అప్పగించినట్టు తెలిసింది. ప్రతీ చలాన్‌ పరిశీలించి, పక్కదారి పట్టిన పన్నులపై నివేదిక ఇవ్వాలని కాగ్‌ను ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. దీంతో కేసును, అరెస్టులను పక్కనబెట్టి చార్జిషీట్‌ వేసే ప్రక్రియ ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది.

అసలు దొంగలు దొరలయ్యారా?
బోధన్‌ కేంద్రంగా సాగిన నకిలీ చలాన్ల స్కాంలో రూ.400 కోట్ల వరకు సొమ్ము పక్కదారిపట్టినట్టు సీఐడీ ఆధారాలతో సహా నిర్ధారించింది. అయితే స్కాంలో అరెస్టయిన అధికారులు సంచలనాత్మక ఆరోపణలు చేస్తున్నారు. ‘మమ్ముల్ని అరెస్ట్‌ చేశారు సరే.. మరి మాపై ఒత్తిడి తెచ్చి శివరాజుకు సహకరించిన కేంద్ర కార్యాలయంలోని ఉన్నతాధికారుల సంగతేంటి’ అని వారు ప్రశ్నించారు. లక్షలు దోచుకొని సౌతాఫ్రికాలో పెట్టుబడులు పెట్టిన ఓ జాయింట్‌ కమిషనర్‌పై చర్యలు తీసుకోరా అని బెయిల్‌పై బయటకు వచ్చిన ఓ అధికారి నిలదీశారు. అప్పుడు దొంగలయిన వారు ఇప్పుడు పునీతులయ్యారని ఆరోపించారు. అంతేకాదు ఆడిటింగ్‌ నిర్వహించిన ఏజీ అధికారులు కూడా స్కాంలో పాత్రధారులేనని సీఐడీ తేల్చిందని, వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement