శోభా..? రవిశంకరా? | Bodiga Shobha Fighting For MLA Tickets Karimnagar | Sakshi
Sakshi News home page

శోభా..? రవిశంకరా?

Published Tue, Oct 9 2018 8:49 AM | Last Updated on Tue, Oct 9 2018 12:43 PM

Bodiga Shobha Fighting For MLA Tickets Karimnagar - Sakshi

మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, సుంకె రవిశంకర్‌

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: గులాబీ దళపతి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించి నెలరోజులు గడిచినా.. చొప్పదండి బరిలో నిలిచే గులాబీ నేత ఎవరు? అన్న సస్పెన్స్‌కు ఇంకా తెరపడ లేదు. ఉమ్మడి కరీంనగర్‌లో 12 అసెంబ్లీ స్థానాలకు 11 మందిని ఖరారు చేసిన అధినేత ఎస్‌సీ రిజర్వుడు స్థానం చొప్పదండిని మాత్రం హోల్డ్‌లో పెట్టారు. అటు తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు ఇవ్వమని చెప్పడం లేదు.. ఇటు కొత్త అభ్యర్థి పేరునూ ప్రకటించడం లేదు.

దీంతో ఈ స్థానం నుంచి టికెట్‌ ఆశించే వారి జాబితాలో రోజుకో పేరు చేరుతోంది. ప్రధానంగా ఆ నియోజకవర్గంలో పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ముఖ్యనేతల ఫిర్యాదుతో శోభకు టికెట్‌ నిలిపివేయగా.. ఫిర్యాదు చేసిన నేతలే సుంకె రవిశంకర్‌ పేరు తెరపైకి తెచ్చారు. టిక్కెట్లు ప్రకటించి నెల రోజులు గడిచిపోగా.. ఈ ఇద్దరిలో ఎవరి పేరును ఇంకా ప్రకటించ లేదు. దీంతో ఇదే స్థానం నుంచి మాజీ మంత్రి గడ్డం వినోద్, రిటైర్డు డీఆర్‌వో బైరం పద్మయ్య, వొల్లాల వాణి, గుర్రం సంధ్యారాణి పేర్లు తెరపైకి రావడం చర్చనీయాంశం అవుతోంది.

వినూత్నరీతిలో బొడిగె శోభ ప్రచారం.. విరుగుడుగా అసంతృప్తుల ప్రచారం..
చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నాయకురాలు బొడిగె శోభ ట్రెండ్‌ మార్చారు. ఓ వైపు పార్టీ టిక్కెట్‌ దక్కుతుందో లేదో తెలియక.. అధినేత మదిలో ఏముందో అర్థం కాక మదన పడుతున్నారు. మరోవైపు తాను నమ్ముకున్న ప్రజలను కలిసేందుకు గ్రామాల్లోకి వెళ్ళి కన్నీటి పర్యంతమవుతూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పేద దళిత మహిళను కావడం.. కొందరి ఫిర్యాదులతోనే తనకు టిక్కెట్‌ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కొంగుచాచి విరాళాలు సేకరిస్తున్నారు.

ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ నీడలో, కేసీఆర్‌ ఆశీస్సులతో ఎదిగిన తనకే పార్టీ అధినేత మళ్లీ అవకాశం ఇస్తారని కూడా చెప్తున్నారు. కాగా.. శోభ ప్రయత్నానికి విరుగుడుగా గులాబీ శ్రేణులు, స్థానిక నాయకులు ఐక్యంగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేపట్టి ప్రజా ఆశీర్వాద సభలతో హడావిడి చేస్తున్నారు. శోభ వైఖరితో ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్న గులాబీ శ్రేణులు తాజా పరిణామాలతో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం ముమ్మరం చేశారు. శోభ వెళ్లిన గ్రామాల్లోకి వెళ్లి భారీ ర్యాలీ నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభతో జనాన్ని ఆకట్టుకున్నారు. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే పార్టీ శ్రేణులను పట్టించుకోకుండా అగౌరవ పరిచేలా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. శోభకు కాకుండా పార్టీ ఎవ్వరికి టిక్కెట్‌ ఇచ్చినా గుండెల్లో పెట్టుకుని గెలిపించుకుంటామని హడావుడి చేస్తున్నారు.

రసకందాయంలో రాజకీయం.. చివరకు అభ్యర్థి ఎవరో మరి..
ఎన్నికల షెడ్యూల్‌ నాటికి కూడా పంచాయితీ తెగకపోవడంతో పోటాపోటీ ప్రచారాలతో చొప్పదండి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అటు ప్రతిపక్షాల్లోనూ, ఇటు స్వపక్షంలోనూ చొప్పదండి రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో స్వపక్షమే విపక్షంగా మారి పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ దళపతి కేసీఆర్, చొప్పదండి అభ్యర్థి ఎంపికను సస్పెన్స్‌లో పెట్టారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న బొడిగె శోభ వ్యవహార శైలిపై టీఆర్‌ఎస్‌ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధినేత కేసీఆర్‌కు పిర్యాదు చేయడంతోనే శోభ అభ్యర్థిత్వాన్ని ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టారని ప్రచారం సాగింది.

నెలరోజులు దాటినా అభ్యర్థిని ఎంపిక చేయకపోవడం, శోభకు వ్యతిరేకంగా స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తుండడంతో ఇంతకాలం వేచిచూసే ధోరణి అవలంబించిన శోభ ఒక్కసారిగా ట్రెండ్‌ మార్చారు. కాట్నపల్లి, రాగంపేటను సందర్శించిన శోభ తన అనుచరులతో సమావేశమై కన్నీటిపర్యంతమయ్యారు. పార్టీలో జరుగుతున్న అవమానాన్ని తలచుకుంటూకన్నీరుమున్నీరుగా విలపించిన శోభను చూసిన స్థానికులు ఆమె పట్ల జాలి చూపారు.

చొప్పదండి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా ఉన్నంతకాలం శోభక్కను తమ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని వారు తీర్మానం కూడా చేశారు. అంతటితో ఆగకుండా శోభకు రెండు కులసంఘాలు పది నుంచి 15 వేలు సమకూర్చాయి. మొత్తంగా చొప్పదండి రాజకీయాలు రసకందాయంలో పడగా, చొప్పదండి పరిణామాలను నిశ్చింతంగా గమనిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్, అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బొడిడె శోభ, సుంకె రవిశంకర్‌లలో ఎవరు అభ్యర్థి అవుతారనే చర్చ సర్వత్రా సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement