బాహుబలి.. జలధారి.. | Bogatha Water Falls Special Story | Sakshi
Sakshi News home page

జజ్జనకరి జలాలే

Published Wed, Oct 16 2019 10:39 AM | Last Updated on Tue, Oct 22 2019 12:08 PM

Bogatha Water Falls Special Story - Sakshi

బొగత జలపాతం

సాక్షి, సిటీబ్యూరో: తెలుగు రాష్ట్రాలు ఈ సీజన్‌లో తడిసిముద్దయి జలసిరితో కళకళలాడుతున్నాయి. దగ్గర ప్రాంతాలు, వారాంతాల్లో వెళ్లి వచ్చే వీలుండడంతో సిటిజనులకు వాటర్‌ ఫాల్స్‌ క్రేజీగా మారాయి.  దీంతో మారుమూల అడవుల్లో దాక్కున్న జలపాతాలూ వెలుగు చూస్తున్నాయి. వానలు ముమ్మరంగా కురిసే టైమ్‌లో మాత్రమే కళకళలాడే వీటిని సందర్శించిన వారు చెప్పిన వివరాల సమాహారమే ఈ కథనం..

బాహుబలి.. జలధారి..
నగరం నుంచి దాదాపు 270కి.మీ దూరంలో ఉంది బొగత జలపాతం. ములుగు జిల్లా ఏటూరు నాగారం, మీదుగా 10 కి.మీ ప్రయాణం చేస్తే బొగత చేరుకోవచ్చు. అత్యంత వెడల్పుగా ఉండే ఈ జలపాతాన్ని బాహుబలి వాటర్‌ ఫాల్స్‌ అని పిలుస్తున్నారు. ఇక్కడ గత రెండేళ్ల నుంచి సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. ఫు#డ్‌ కి చిన్న చిన్న హోటల్స్,రెస్టారెంట్స్‌ ఉన్నాయి. కృత్రిమంగా కట్టిన పూల్‌లో వాటర్‌ ఫ్లో ఎక్కువ లేనప్పుడు హాయిగా ఆడుకోవచ్చు.  జలధారలను  వాచ్‌ టవర్‌ నుంచి చూడడం  చక్కని అనుభవం.  

ముత్యమంటి నీటి ధార...
ఏటూరు నాగారం దాటాక  రైట్‌ తీసుకుంటే వెంకటాపురం మండలంలో 7 కి.మీ చిక్కని అడవిలో ప్రయాణిస్తే ముత్యాలధార జలపాతం ఉంటుంది.  ద్విచక్రవాహనాలైతే 4 కి.మీ వరకూ వెళ్లొచ్చు. ట్రాక్టర్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి. కొంత దూరం పూర్తిగా నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరం విచిత్రమైన అనుభూతినిస్తుంది.  దేశంలోనే అత్యంత ఎత్తయిన జలపాతాల్లో ఒకటి ఇది.  పైన ఉన్న రాక్‌ స్ట్రక్చర్‌ వల్ల చినుకులు ముత్యాల్లా మెరుస్తుంటాయి. ఎక్కువగా ట్రెక్కర్స్‌ వెళ్లే దీనిని  సాహసయాత్రనే చెప్పాలి.   నీళ్లలో నడక గంట సేపు ఉంటుంది. బాగా వాన పడిన సమయమైతే మోకాలి లోతు నీళ్లలో నడవాలి. స్థానికంగా దొరికే ట్రాక్టర్స్‌  ట్రిప్‌కి రూ..3 వేల దాకా వసూలు చేస్తారు. ఎలాంటి వసతి సౌకర్యాలు ఉండవు, ఫుడ్, దొరకదు.

పొచ్చర..జరజర
నిజామాబాద్‌ వెళ్లే దారిలో పొచ్చర వాటర్‌ ఫాల్స్‌ ఉంది. మెయిన్‌ వాటర్‌ ఫాల్స్‌  వెనుక 100 మీటర్ల ఎత్తులో చెక్‌డ్యామ్‌ ఉంటుంది. అదీ పెద్దగా లోతు ఉండదు. పార్కింగ్‌ సౌకర్యం, సెక్యూరిటీ, ఫుడ్‌స్టాల్స్‌ వంటివి ఉంటాయి. వెళ్లి రావడానికి రోడ్‌ కూడా చాలా బాగుంటుంది. ఒక్కరోజులో వెళ్లి వచ్చేయవచ్చు.

ఆడు‘కుంటా’లలా
 నగరం నుంచి 260 కి.మీ. ఆదిలాబాద్‌ నుంచి 70 కి.మీ ప్రయాణం చేస్తే వస్తుంది. ఇది 45 మీటర్లతో ఎత్తయిన జలపాతాల్లో ఒకటిగా పేరొందింది. పలు కుంటలు/సరస్సులు కలిపినది కాబట్టి దీన్ని కుంటాల అంటారు. నగరం నుంచి వాటర్‌ ఫాల్స్‌ ఎంట్రీ దాకా చక్కని రవాణా సౌకర్యం ఉండడంతో దీనికి వెళ్లి రావడం చాలా సులభమైన విషయం. జలపాతం అడుగుదాకా వెళ్లడానికి 300కిపైగా మెట్లు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలూ ఉన్నాయి. సమీప ప్రాంతంలోనే మరికొన్ని గుడులు, జలపాతాలు కూడా ఉన్నాయి. అవీ చూసిరావచ్చు.  

హిల్స్‌ ఎక్కి దిగితే ఫాల్స్‌...
పోచర నుంచి 10, 15 కి.మీ దాటాక హైవే నుంచి 10కి.మీలలో ఉంటుంది గాయత్రి వాటర్‌ ఫాల్స్‌ . ఇదొక కఠినమైన ప్రయాణం. మ«ధ్యలో తగిలే గ్రామంలో ఉన్నవారు మనల్ని గాయత్రి వాటర్‌ ఫాల్స్‌కి తీసుకువెళ్లి తీసుకురావడానికి కొంత మొత్తం తీసుకుని సర్వీస్‌ ఇస్తారు. అత్యంత ఎత్తయిన వాటర్‌ ఫాల్స్‌లో ఒకటిగా పేరున్న ఈ జలపాతం చూడడానికి 3 కొండలు దిగి ఎక్కాల్సి ఉంటుంది. అయితే ఈ ఫాల్స్‌లోకి దిగడానికి మాత్రం కుదరదు. నీటి ప్రవాహం, లోతు ఎక్కువగా ఉంటుంది.  

మల్లెలంత హాయిగా...
శ్రీశైలం హైవేలో వెళుతుంటే మున్ననూరు చెక్‌పోస్ట్‌ నుంచి ఎడమవైపు 10 కి.మీ వెళ్లాక మల్లెల తీర్థం ఉంటుంది. హాయిగా ఫ్యామిలీతో సులభంగా వెళ్లి రాగల వాటర్‌ ఫాల్స్‌ ఇది.  జలపాతం నీళ్లలో శుభ్రంగా ఆడుకోవచ్చు. ఇక్కడ సౌకర్యాలు ఓ మోస్తరుగా ఉంటాయి. నగరం నుంచి ఒక్కరోజులో వెళ్లి రావచ్చు. శ్రీశైలం వెళ్లేటప్పుడు కూడా మధ్యలో 2/3 గంటల్లోచూసేయవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement