సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బోనాల జాతర ఆదివారం గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో ప్రారంభం కానుంది. దీనికోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గోల్కొండ కోట, అమ్మవారి ఆలయం, పరిసర ప్రాంతాలను అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భారీసంఖ్యలో తరలిరానున్న భక్తుల కోసం అన్ని సదుపాయాలను సిద్ధం చేశారు. వందల ఏళ్లుగా నగరప్రజలు ఎంతో ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. కరువు, కాటకాలు, అంటువ్యాధుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ప్రజలు భక్తిప్రపత్తులతో శక్తి స్వరూపిణి అయిన మహంకాళికి సమర్పించే ప్రసాదమే బోనం. నేటి(ఆదివారం) నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ప్రతి ఆది, గురువారాల్లో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు.
ఈ 15వ తేదీనే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర సన్నాహాలు మొదలవుతాయి. ఇందులో భాగంగా ఆదివారం నుంచి ఘటం ఎదుర్కోలు నిర్వహిస్తారు. ఉజ్జయిని మహంకాళి ముఖాకృతి, ఆభరణాలు, వస్త్రాలను ఘటంపై ఉంచి ప్రధాన ప్రాంతాల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అనంతరం ఈ నెల 29న మహంకాళి బోనాలు, 30న రంగం భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే లాల్‌దర్వాజ సింహవాహిని బోనాల పండుగ జరుగుతుంది. బోనాల ఉత్సవాల దృష్ట్యా గోల్కొండ కోటలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొదటిరోజు సుమారు లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశముంది.
అధికార లాంఛనాలతో ఉత్సవాలు...
ఆదివారం ఉదయం గోల్కొండ బోనాల పండుగ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు లంగర్‌హౌస్ వద్ద తొట్టెల ఊరేగింపు మొదలవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసే స్వాగ తవేదిక వద్దకు మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి వచ్చి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, అధికార లాంఛనాలు సమర్పిస్తారు. బోనా ల ఊరేగింపు సందర్భంగా నిర్వí హించే ప్రతిఘట్టం భక్తిపూరితంగా, భావోద్వేగభరితంగా ఉంటుంది. పోత రాజుల నృత్యాలు, బ్యాండుమేళాలు, భక్తకోటి కోలాహలం, తొట్టెల ఊరేగింపు కనులపండువగా సాగిపోతాయి. గో ల్కొండ కోటపైకి అమ్మవారి ఊరేగింపు కాలినడకన చేరుకోవడంతో అక్కడ పెద్ద జాతరను తలపిస్తుంది. సువిశాలమైన గోల్కొండ కోట భక్తులతో కిటకిటలాడుతుంది. నగీనాబాగ్ నుంచి భక్తరామదాసు బందీఖానా మీదుగా అమ్మవార్ల ఆలయానికి మెట్లపై వెళ్లే మార్గంలో బారులు తీరిన భక్తులను చూసేందుకు రెండు కళ్లు చాలవు.
తెలంగాణ భవన్‌లో బోనాల సంబరాలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం, లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుంచి మూడు రోజలు పాటు తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతులు దేశవ్యాప్తంగా తెలిసేలా ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ శనివారం తెలిపారు. జూలై 16న ఫొటో ఎగ్జిబిషన్, 17న ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి భవన్‌లో ప్రతిష్టించడం, రాత్రి బోనాల విశిష్టతను తెలుపుతూ తెలుగు వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ సత్యనారాయణ అధ్యక్షతన కవి సమ్మేళనం, 18న అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ కవిత పాల్గొనే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment