mahankali jatara
-
వింటే భారతం చూస్తే బోనం
పండుగల సందర్భాలలో నగరాల్లో నివాసం ఉంటున్నవారు తమ గ్రామాలకు తరలి వెళ్తారు. బోనాలు, మహంకాళి జాతరలకు మాత్రం గ్రామాల నుంచి ప్రజలు నగరాలకు చీమల వరుసలుగా తరలివస్తారు. బోనాలు ఇంతటి విశిష్టతను సంతరించుకోడానికి కారణం.. అవి మాతృస్వామ్యపు వైభవాలు కావడమేనని తాజాగా వెలువడిన ఛాయాచిత్ర ఖచిత మహోద్గ్రంథం ‘బోనాలు– మహంకాళిజాతర’లో ఆ పుస్తక ప్రధాన సంపాదకుడు, ప్రముఖ సినీ దర్శకుడు బి.నరసింగరావు; పుస్తక పదకర్త, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్వాహకులు మామిడి హరికృష్ణ అంటున్నారు. అనాదికాలం నుంచీ స్త్రీ దేవతలను ఆరాధించే సంప్రదాయం మన సంస్కృతిలో ఉంది. మానవ పరిణామక్రమంలో నిరంతరాయంగా ప్రవహిస్తోన్న భావధార ఆ సంప్రదాయం. ఇందులో కాలానుగుణంగా అనేక ఆచారాలు, విధి విధానాలు ప్రవేశించి ఈ ఆరాధన ఒక జీవన విధానంగా స్థిరపడింది. హైదరాబాద్–సికింద్రాబాద్.. జంట నగరాల్లో ప్రజలు జరుపుకునే బోనాలు జాతర.. స్త్రీ దేవతారాధనలో తనదైన ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ‘బోనం తెలంగాణ ఆత్మ అయితే, బతుకమ్మ తెలంగాణ జీవితం’ అంటారు బి.నరసింగరావు. బోనం ఇవ్వడం అంటే తమ కష్టసుఖాల్లో నువ్వు తోడుగా ఉన్నావమ్మా అని సాధారణ ప్రజలు దేవతకు కృతజ్ఞత చెప్పడం. పురాతన కాలం నుంచీ బోనాలు సమర్పించే సంప్రదాయం ఉంది. ఆ వైనాలను ఇతిహాసాల నుంచి, చరిత్ర నుంచి వివరిస్తూ, ‘మదర్ రైట్స్’ గ్రంథ రచయిత బారన్ ఒమర్ రోల్ఫ్ మాతృదేవతారాధనల గురించి అనేక ఆసక్తికరమైన అంశాలను ఆ పుస్తకంలో ప్రస్తావించారు. గ్రీకు దేవత డెమటార్, ఉపఖండపు దేవత చాముండి.. ప్రజలను అంటురోగాల నుంచి కాపాడే స్త్రీ శక్తులు. క్రీ.పూ. ఇరవై వేల సంవత్సరాల నాటికే తమిళనాడులోని అడిచెన్నలూరు, ఆస్ట్రియా, రష్యా దేశాలలో లభించిన త్రికోణాకారపు ప్రతిమల సారూప్యతలను వివరిస్తూ, సింధు నాగరికతలో మాతృదేవత.. ప్రధాన దైవంగా స్థిరపడినట్లు రోల్ఫ్ రాశారు. ఆసక్తికరమైన ఆ వివరాలు కూడా ‘బోనాలు– మహం కాళి జాతర’ పుస్తకంలో ఉన్నాయి. మనిషి నేటి రూపాన్ని, ఆహారపు అలవాట్లను సంతరించుకునే క్రమంలో తాము స్వీకరించే ఆహారం మార్పులకు లోనైనట్లే బోనాల సంప్రదాయంలో, స్థలకాలాదుల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. తొలినాళ్లలో గ్రామాలకు మాత్రమే పరిమితమైన బోనాలు.. మెట్రో నగరంలో కుటుంబాలు సమూహాలుగా మారి జరుపుకునే పండుగగా పరిణామం చెందింది. జంట నగరాలలో శ్రావణ–ఆషాఢ మాసాలలో (రుతువులు మారి అంటువ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉన్న జూన్–జూలై–ఆగస్ట్ మాసాలలో) జరిగే బోనాలు, మహంకాళి జాతర సందర్భంగా గ్రామాల నుంచి ప్రజలు నగరానికి తరలి వస్తారు. పిల్లాజెల్లలను రోగాల బారి నుంచి కాపాడండమ్మా అని అర్థిస్తూ, నగరంలోని బోనాల జాతర సందర్భంగా ప్రధానంగా పోచమ్మ, ఎల్లమ్మ దేవతలకు బోనాలు సమర్పిస్తారు. ఇవన్నీ పైపైన తెలిసిన విషయాలే కానీ, తెలియనివి, తెలుసుకోవలసినవి అయిన విశేషాలెన్నింటినో ఒక పిక్టోరియల్ హిస్టరీగా ఈ పుస్తకం కనువిందు చేసి, దివ్యానుభూతిని కలిగిస్తుంది. అపురూప భావచిత్రాలు శివరామాచారి శిల్పం ముఖచిత్రంగా, విద్యాసాగర్ లక్కా పసుపు పారాణి పాద చిత్రం బ్యాక్ కవర్‌గా వెలువడిన ‘బోనాలు : మహంకాళి జాతర’ పుస్తకంలో పద్నాలుగు మంది సిద్ధహస్తులైన స్టిల్ ఫొటోగ్రాఫర్లు తీసిన జాతర ఫోటోలతో పాటు.. అన్నవరం శ్రీనివాస్ ప్రాథమిక వర్ణాలను ఉపయోగించి చిత్రించిన పది పెయింటింగుల బోనాల సంప్రదాయపు అపురూప భావచిత్రాలు కూడా ఇందులో ఉన్నాయి. (పుస్తకం వివరాలను ఇవాళ్టి ‘సాహిత్యం’పేజీలో చూడొచ్చు). -
కోటంత బోనం.. కొండంత జనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బోనాల జాతర ఆదివారం గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో ప్రారంభం కానుంది. దీనికోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గోల్కొండ కోట, అమ్మవారి ఆలయం, పరిసర ప్రాంతాలను అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భారీసంఖ్యలో తరలిరానున్న భక్తుల కోసం అన్ని సదుపాయాలను సిద్ధం చేశారు. వందల ఏళ్లుగా నగరప్రజలు ఎంతో ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. కరువు, కాటకాలు, అంటువ్యాధుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ప్రజలు భక్తిప్రపత్తులతో శక్తి స్వరూపిణి అయిన మహంకాళికి సమర్పించే ప్రసాదమే బోనం. నేటి(ఆదివారం) నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ప్రతి ఆది, గురువారాల్లో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఈ 15వ తేదీనే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర సన్నాహాలు మొదలవుతాయి. ఇందులో భాగంగా ఆదివారం నుంచి ఘటం ఎదుర్కోలు నిర్వహిస్తారు. ఉజ్జయిని మహంకాళి ముఖాకృతి, ఆభరణాలు, వస్త్రాలను ఘటంపై ఉంచి ప్రధాన ప్రాంతాల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అనంతరం ఈ నెల 29న మహంకాళి బోనాలు, 30న రంగం భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే లాల్‌దర్వాజ సింహవాహిని బోనాల పండుగ జరుగుతుంది. బోనాల ఉత్సవాల దృష్ట్యా గోల్కొండ కోటలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొదటిరోజు సుమారు లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశముంది. అధికార లాంఛనాలతో ఉత్సవాలు... ఆదివారం ఉదయం గోల్కొండ బోనాల పండుగ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు లంగర్‌హౌస్ వద్ద తొట్టెల ఊరేగింపు మొదలవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసే స్వాగ తవేదిక వద్దకు మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి వచ్చి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, అధికార లాంఛనాలు సమర్పిస్తారు. బోనా ల ఊరేగింపు సందర్భంగా నిర్వí హించే ప్రతిఘట్టం భక్తిపూరితంగా, భావోద్వేగభరితంగా ఉంటుంది. పోత రాజుల నృత్యాలు, బ్యాండుమేళాలు, భక్తకోటి కోలాహలం, తొట్టెల ఊరేగింపు కనులపండువగా సాగిపోతాయి. గో ల్కొండ కోటపైకి అమ్మవారి ఊరేగింపు కాలినడకన చేరుకోవడంతో అక్కడ పెద్ద జాతరను తలపిస్తుంది. సువిశాలమైన గోల్కొండ కోట భక్తులతో కిటకిటలాడుతుంది. నగీనాబాగ్ నుంచి భక్తరామదాసు బందీఖానా మీదుగా అమ్మవార్ల ఆలయానికి మెట్లపై వెళ్లే మార్గంలో బారులు తీరిన భక్తులను చూసేందుకు రెండు కళ్లు చాలవు. తెలంగాణ భవన్లో బోనాల సంబరాలు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం, లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుంచి మూడు రోజలు పాటు తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతులు దేశవ్యాప్తంగా తెలిసేలా ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ శనివారం తెలిపారు. జూలై 16న ఫొటో ఎగ్జిబిషన్, 17న ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి భవన్లో ప్రతిష్టించడం, రాత్రి బోనాల విశిష్టతను తెలుపుతూ తెలుగు వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ సత్యనారాయణ అధ్యక్షతన కవి సమ్మేళనం, 18న అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ కవిత పాల్గొనే అవకాశం ఉందన్నారు. -
'మహంకాళి జాతరను ప్రశాంతంగా నిర్వహిస్తాం'
రాంగోపాల్‌పేట్: జూలై 24, 25 వ తేదీల్లో జరుగనున్న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు చేపట్టాల్సిన భద్రత చర్యలపై ఉత్తర మండలం డీసీపీ సుమతి మంగళవారం పరిశీలించారు. మొదటి సారిగా దేవాలయానికి వచ్చిన ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ట్రాఫిక్, పోలీసులు అధికారులతో కలిసి దేవాలయంతో పాటు పరిసరాలను పరిశీలించారు. ఆలయ విశిష్టత, ఎంత మంది భక్తులు హాజరవుతారు, క్యూలైన్లు తదితర వివరాలను ఈవో అన్నపూర్ణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.