వింటే భారతం చూస్తే బోనం | Tradition of Worshiping the Female Gods is in Our Culture | Sakshi
Sakshi News home page

వింటే భారతం చూస్తే బోనం

Published Mon, Apr 15 2019 2:12 AM | Last Updated on Mon, Apr 15 2019 2:12 AM

Tradition of Worshiping the Female Gods is in Our Culture - Sakshi

పండుగల సందర్భాలలో నగరాల్లో నివాసం ఉంటున్నవారు తమ గ్రామాలకు తరలి వెళ్తారు. బోనాలు, మహంకాళి జాతరలకు మాత్రం గ్రామాల నుంచి ప్రజలు నగరాలకు చీమల వరుసలుగా తరలివస్తారు. బోనాలు ఇంతటి విశిష్టతను సంతరించుకోడానికి కారణం.. అవి మాతృస్వామ్యపు వైభవాలు కావడమేనని తాజాగా వెలువడిన ఛాయాచిత్ర ఖచిత మహోద్గ్రంథం ‘బోనాలు– మహంకాళిజాతర’లో ఆ పుస్తక ప్రధాన సంపాదకుడు, ప్రముఖ సినీ దర్శకుడు బి.నరసింగరావు; పుస్తక పదకర్త, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్వాహకులు మామిడి హరికృష్ణ అంటున్నారు.

అనాదికాలం నుంచీ స్త్రీ దేవతలను ఆరాధించే సంప్రదాయం మన సంస్కృతిలో ఉంది. మానవ పరిణామక్రమంలో నిరంతరాయంగా ప్రవహిస్తోన్న భావధార ఆ సంప్రదాయం. ఇందులో కాలానుగుణంగా అనేక ఆచారాలు, విధి విధానాలు ప్రవేశించి ఈ ఆరాధన ఒక జీవన విధానంగా స్థిరపడింది. హైదరాబాద్‌–సికింద్రాబాద్‌.. జంట నగరాల్లో ప్రజలు జరుపుకునే బోనాలు జాతర.. స్త్రీ దేవతారాధనలో తనదైన ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ‘బోనం తెలంగాణ ఆత్మ అయితే, బతుకమ్మ తెలంగాణ జీవితం’ అంటారు బి.నరసింగరావు. బోనం ఇవ్వడం అంటే తమ కష్టసుఖాల్లో నువ్వు తోడుగా ఉన్నావమ్మా అని సాధారణ ప్రజలు దేవతకు కృతజ్ఞత చెప్పడం.

పురాతన కాలం నుంచీ బోనాలు సమర్పించే సంప్రదాయం ఉంది. ఆ వైనాలను ఇతిహాసాల నుంచి, చరిత్ర నుంచి వివరిస్తూ, ‘మదర్‌ రైట్స్‌’ గ్రంథ రచయిత బారన్‌ ఒమర్‌ రోల్ఫ్‌ మాతృదేవతారాధనల గురించి అనేక ఆసక్తికరమైన అంశాలను ఆ పుస్తకంలో ప్రస్తావించారు. గ్రీకు దేవత డెమటార్, ఉపఖండపు దేవత చాముండి.. ప్రజలను అంటురోగాల నుంచి కాపాడే స్త్రీ శక్తులు. క్రీ.పూ. ఇరవై వేల సంవత్సరాల నాటికే తమిళనాడులోని అడిచెన్నలూరు, ఆస్ట్రియా, రష్యా దేశాలలో లభించిన త్రికోణాకారపు ప్రతిమల సారూప్యతలను వివరిస్తూ, సింధు నాగరికతలో మాతృదేవత.. ప్రధాన దైవంగా స్థిరపడినట్లు రోల్ఫ్‌ రాశారు.  ఆసక్తికరమైన ఆ వివరాలు కూడా ‘బోనాలు– మహం కాళి

జాతర’ పుస్తకంలో ఉన్నాయి. 
మనిషి నేటి రూపాన్ని, ఆహారపు అలవాట్లను సంతరించుకునే క్రమంలో తాము స్వీకరించే ఆహారం మార్పులకు లోనైనట్లే బోనాల సంప్రదాయంలో, స్థలకాలాదుల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. తొలినాళ్లలో గ్రామాలకు మాత్రమే పరిమితమైన బోనాలు.. మెట్రో నగరంలో కుటుంబాలు సమూహాలుగా మారి జరుపుకునే పండుగగా పరిణామం చెందింది. జంట నగరాలలో శ్రావణ–ఆషాఢ మాసాలలో (రుతువులు మారి అంటువ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉన్న జూన్‌–జూలై–ఆగస్ట్‌ మాసాలలో) జరిగే బోనాలు, మహంకాళి జాతర సందర్భంగా గ్రామాల నుంచి ప్రజలు నగరానికి తరలి వస్తారు. పిల్లాజెల్లలను రోగాల బారి నుంచి కాపాడండమ్మా అని అర్థిస్తూ, నగరంలోని బోనాల జాతర సందర్భంగా ప్రధానంగా పోచమ్మ, ఎల్లమ్మ దేవతలకు బోనాలు సమర్పిస్తారు. ఇవన్నీ పైపైన తెలిసిన విషయాలే కానీ, తెలియనివి, తెలుసుకోవలసినవి అయిన విశేషాలెన్నింటినో ఒక పిక్టోరియల్‌ హిస్టరీగా ఈ పుస్తకం కనువిందు చేసి, దివ్యానుభూతిని కలిగిస్తుంది.                                              

అపురూప భావచిత్రాలు
శివరామాచారి శిల్పం ముఖచిత్రంగా, విద్యాసాగర్‌ లక్కా పసుపు పారాణి పాద చిత్రం బ్యాక్‌ కవర్‌గా వెలువడిన ‘బోనాలు : మహంకాళి జాతర’ పుస్తకంలో పద్నాలుగు మంది సిద్ధహస్తులైన స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌లు తీసిన జాతర ఫోటోలతో పాటు.. అన్నవరం శ్రీనివాస్‌ ప్రాథమిక వర్ణాలను ఉపయోగించి చిత్రించిన పది పెయింటింగుల బోనాల సంప్రదాయపు అపురూప భావచిత్రాలు కూడా ఇందులో ఉన్నాయి. (పుస్తకం వివరాలను ఇవాళ్టి ‘సాహిత్యం’పేజీలో చూడొచ్చు).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement