మహంకాళి అమ్మవారు , బంగారు బోనం (నమూనా)
ఆషాఢ బోనాలకు గ్రేటర్ సిద్ధమయింది. ఆదివారం నుంచి గోల్కొండ జగదాంబికా అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29, 30 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతాయి. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
సాక్షి, సిటీబ్యూరో: ఆషాఢమాసం... ఆధ్మాత్మిక ఆదివారం. ఆబాలగోపాలాన్ని పులకింపజేసే అద్భుత క్షణాలు... నాలుగు శతాబ్దాల మహోన్నత చారిత్రక ఈ వేడుక. విభిన్న వర్గాలను, భిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత సాంస్కృతిక, సామూహిక ఉత్సవం బోనాల పండుగ. ఆదివారం గోల్కొండ జగదాంబిక బోనాలతో ఆరంభమయ్యే వేడుకలకు నగరం సర్వం సన్నద్ధమైంది. అదేరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఘటోత్సవం ప్రారంభం కానుంది. ఈ నెల 29, 30 తేదీల్లో మహంకాళి బోనాలు, రంగం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ అధికారిక పండుగ అయిన బోనాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ఆ తరువాత లాల్‌దర్వాజ సింహవాహిని బోనాల వేడుక జరుగనుంది. ఈ వేడుకలతో పాటే నగరంలోని వివిధ ప్రాంతాల్లో బోనాల పండుగ జరుగనుంది. అన్ని ప్రధాన ఆలయాల్లో ఉత్సవాల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయాన్ని అందంగా అలంకరిస్తున్నారు.
బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు బోనాల ఉత్సవాల దృష్ట్యా గోల్కొండ కోటలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. మొదటి రోజు సుమారు లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. మరోవైపు జగదాంబిక ఆలయ మార్గాలను విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. శుక్రవారం స్థానిక మహిళలు మెట్ల పూజలు చేశారు. ఆలయానికి వెళ్లే అన్ని మెట్లను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించారు. ఆలయం వద్ద భక్తులు బోనాలు సమర్పించేందుకు అనుగుణంగా వాటర్‌ప్రూఫ్ షెడ్‌లను ఏర్పాటు చేశారు. రామదాసు బందీఖానా, నగీనాబాగ్, తదితర ప్రాంతాల్లోనూ భక్తుల కోసం అదనంగా వాటర్ ప్రూఫ్ షెడ్‌లను ఏర్పాటు చేశారు. బోనాల ఉత్సవానికి సర్వం సన్నద్ధమైన గోల్కొండ కోటను రంగురంగుల విద్యుద్దీపాలతో అందమైన వెలుగుల కొండలా తీర్చిదిద్దారు.
అధికార లాంఛనాలతో ఉత్సవాలు...
డప్పు దరువులు, హోరెత్తించే పాటల పరవళ్లు, పోతరాజు నృత్య ప్రదర్శనల నడుమ ఆదివారం ఉదయం గోల్కొండ బోనాల పండుగ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు లంగర్‌హౌస్ వద్ద తొట్లె ఊరేగింపు మొదలవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసే స్వాగత వేదికపై రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి తదితరులు హాజరై అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, అధికార లాంఛనాలు, అలాగే సాక సమర్పిస్తారు. దీంతో అట్టహాసంగా వేడుకలు ప్రారంభమవుతాయి. భారీ ఊరేగింపుతో తొట్టెల ప్రదర్శన ముందుకు సాగుతుంది. ఊరేగింపు చోటా బజార్‌కు చేరుకున్న తరువాత అనంతాచారి ఇంటి నుంచి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను తీసుకొని బయలుదేరుతారు. అక్కడి నుంచి తొట్టెలు, రథం, అమ్మవార్ల విగ్రహాలు ప్రదర్శనగా బయలుదేరుతాయి. నిజాం కాలం నుంచి బోనం సమర్పిస్తున్న పటేలమ్మ బోనం ఈ ప్రదర్శనలో కలుస్తుంది. అంతా కలిసి జగదాంబిక ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో జగదాంబిక, మహంకాళి అమ్మవార్లను ప్రతిష్టించడంతో ఆ రోజు వేడుక ముగుస్తుంది. 15వ తేదీ నుంచి వచ్చేనెల 12వ తేదీ వరకు ప్రతి ఆది, గురు వారాల్లో 9 ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 22వ తేదీ ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. ఆ ఒక్క రోజు 3 లక్షల మందికి పైగా భక్తులు రానున్నట్లు అంచనా..
బోనాలు....
శక్తి స్వరూపినైన అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో తాము తయారు చేసిన ప్రసాదాన్ని సమర్పించడమే బోనం. స్త్రీలు తల స్నానం చేసి నూతన వస్త్రాలతో ఒక పాత్రకు పసుపును పూసి దానికి వేపాకు కొమ్మలతో పసుపు నీటిని తీసుకుని వచ్చి అమ్మవారికి సాకను సమర్పిస్తారు. మేళతాళాలు, డప్పుల దరువులతో అమ్మవారికి సాకను సమర్పిస్తారు.
163 ఏళ్లుగా ఉజ్జయిని అమ్మవారి సేవలో...
మారేడుపల్లి: ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు మారేడుపల్లి ఓ ప్రత్యేకత చాటుకుంటోంది. ఘటం అలంకరణ నుంచి జాతర ముగింపు, అమ్మవారిని సాగనంపే వరకు మారేడుపల్లికి చెందిన కుమ్మరి రత్నయ్య కుటుంబ సభ్యులు వంశపారంపర్యంగా అమ్మవారికి సేవలు అందిస్తున్నారు. కీలక ఘట్టమైన రంగం (భవిష్యవాణి)కి పచ్చికుండను తరతరాలుగా ఈ కుటుంబ సభ్యులే అందజేస్తున్నారు. అమ్మవారికి మొదటి సేవ కుమ్మరి కులస్తులు చేయాల్సి ఉంటుంది. 163 ఏళ్ల క్రితం ఉజ్జయినీ నుంచి అమ్మవారిని తీసుకువచ్చి మహంకాళి ఆలయంలో ప్రతిష్ఠించినప్పుడు కుమ్మరి వారిచే పూజ నిర్వహించాల్సి ఉండగా ఆ కులానికి పెద్దమనిషిగా ఉన్న డిఫెన్స్ కాంట్రాక్టర్ సికింద్రాబాద్‌కు చెందిన కుమ్మరి రత్నయ్యకు అవకాశం లభించింది. అనంతరం తరతరాలుగా అతడి కుటుంబ సభ్యులకే అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం లభించింది. ప్రస్తుతం అలంకరణ కార్యక్రమాన్ని వెస్ట్ మారేడుపల్లికి చెందిన కుమ్మరి రత్నయ్య కుటుంబ సభ్యులైన కుమ్మరి బిజ్జవరపు వినోద్ నిర్వహిస్తారు. పచ్చికుండకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈనెల 30న జరిగే రంగం కార్యక్రమానికి భాజాభజంత్రీలతో అర్ధరాత్రి మహంకాళి ఆలయానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment