సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోటలో నిర్వహించనున్న పంద్రాగస్టు వేడుకలకు పోలీస్ విభాగం పకడ్బందీగా భద్రతా చర్యలు చేపడుతోంది. ‘కోట’ను పూర్తి స్థాయిలో నిఘా నీడలో ఉంచనుంది. పరిసర ప్రాంతాలు, రహదారుల పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆయా మార్గాలో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, కమ్యూనిటీ సీసీ కెమెరాలకు తోడు తాత్కాలిక ప్రాతిపదిక 120 అదనపు కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు... వీటిని బషీర్‌బాగ్ పోలీస్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)తో అనుసంధానించారు. గోల్కొండ కోటలో ప్రతి అణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్, గోల్కొండ కోట వద్ద ఉన్న కంట్రోల్ రూమ్‌లోనూ దృశ్యాలను వీక్షించేలాఏర్పాటు చేశారు.
కోటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ ఏవైనా సవాళ్లు ఎదురైతే వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి ఈ ని«ఘా ఉపకరిస్తుంది. సీసీసీలో ఉండే మ్యాప్‌ల ద్వారా కోట చుట్టుపక్కల మార్గాలనూ అధ్యయనం చేసే అవకాశం ఉంది. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తుండే సీసీసీలోని అధికారులు అవసరానికి తగ్గట్టు స్థానిక పోలీసుల్ని అప్రమత్తం చేయడంతో పాటు అదనపు బలగాలను మోహరిస్తారు. ఈ తాత్కాలిక సీసీ కెమెరాల పనితీరుపై సీసీసీ అధికారులు సోమవారం ట్రయల్ రన్ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం అన్ని విభాగాల అధికారులతో భేటీ అయ్యారు. ఈ చర్యల్లో భాగంగా కోటతో పాటు రాజ్‌భవన్‌కు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించడానికి సిటీ సీపీ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం కోట, రాజ్‌భవన్‌ను సందర్శించి అవసరమైన మార్పుచేర్పులు సూచించనున్నారు.
క్షుణ్ణంగా తనిఖీ...
గోల్కొండ కోట, పరేడ్‌గ్రౌండ్స్‌కు వచ్చే సందర్శకులు తమ వెంట హ్యాండ్‌బ్యాగ్‌లు, కెమెరాలు, టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్లు తదితర ఎలాంటి వస్తువులు తీసుకురావడానికి వీల్లేదు. అత్యవసరమై ఎవరైనా తీసుకువచ్చినా కచ్చితంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగరవ్యాప్తంగా నిఘా, గస్తీ ముమ్మరం చేశారు. అడుగడుగునా నాకాబందీ, తనిఖీలు నిర్వహిస్తున్నారు. జనసమ్మర్థ ప్రాంతాలతో పాటు బస్సులు, రైళ్లల్లోనూ పోలీసులు సోదాలు చేస్తున్నారు. లాడ్జీలు, అనుమానిత ప్రాంతాలపై డేగకన్ను వేశారు. పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించారు. గోల్కొండ కోటలోకి దారితీసే ప్రతి ద్వారం దగ్గరా డోర్‌ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయనున్నారు.
ట్రాఫిక్ నిర్వహణకు ఏర్పాట్లు...
పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట, పరేడ్‌గ్రౌండ్స్, రాజ్‌భవన్ వద్ద ట్రాఫిక్ విభాగం తరఫున పటిష్ట ఏర్పాట్లు చేశామని ట్రాఫిక్ వింగ్ చీఫ్ అనిల్‌కుమార్ వెల్లడించారు. 900 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. డీసీపీలు ఎల్‌ఎస్ చౌహాన్, బాబూరావులతో కలిసి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోల్కొండ, సికింద్రాబాద్, రాజ్‌భవన్‌లో జరిగే మూడు కార్యక్రమాల్లోనూ సీఎం కేసీఆర్ పాల్గొంటారని వెల్లడించారు. ముందుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, అక్కడి నుంచి గోల్కొండ కోటకు వెళ్తారన్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు, ట్రాఫిక్ నిలిపివేత ఆయా రూట్లలో చేపడుతున్నట్లు వివరించారు. వీఐపీల కోసం ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్ విభాగాలుగా ప్రభుత్వం పాసులు జారీ చేసిందన్నారు. పాస్‌ల వెనకాల పార్కింగ్ స్థలం, వేడుకలకు వచ్చే మార్గం తదితర సూచనలు ఉన్నాయన్నారు. పార్కింగ్ స్థలాల నుంచి వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారన్నారు. వర్షం పడితే ఇబ్బందులు ఎదురుకాకుండా జీహెచ్‌ఎంసీ గొడుగులను అందుబాటులో ఉచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆయన గోల్కొండకు వచ్చే వారి కోసం రూట్‌మ్యాప్ విడుదల చేశారు. పాస్‌లున్న వారు స్పష్టంగా కన్పించే విధంగా కారుకు ముందుభాగంలో అంటించుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో పోలీసులకు సహకరించాలని కోరారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా...గోల్కొండ చుట్టుపక్కల...
♦ బుధవారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రాందేవ్‌గూడ–గోల్కొండ కోటకు వెళ్లే రోడ్డును మూసివేస్తారు. ఏ,బీ,సీ స్టిక్కర్స్ ఉన్న వాహనాలను మాత్రమే ఉదయం 7:30–10గంటల వరకు ఈ రూట్‌లోకి అనుమతిస్తారు.
♦ సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే ఏ,బీ,సీ పాస్ కలిగిన వాహనాలను వయా రేతిబౌలి జంక్షన్, నాలానగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్‌టర్న్ తీసుకొని బాలికా భవన్, ఆంధ్ర ఫ్లోర్ మిల్స్, ప్లైఓవర్, లంగర్‌హౌస్, టిప్పుఖాన్ బ్రిడ్జ్, రాందేవ్‌గూడ రైట్ టర్న్‌తో మాకై దర్వాజ నుంచి గోల్కొండ పోర్ట్‌కు చేరుకోవాలి. అక్కడ వారికి కేటాయించిన స్థలాలలో వాహనాలను పార్కింగ్ చేయాలి.
రాజ్‌భవన్ రోడ్డులో...
♦ రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమాల నేపథ్యంలో సాయంత్రం 4:30గంటల నుంచి రాత్రి 10గంటల వరకు రాజ్‌భవన్ రూట్‌లో ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. సోమాజిగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి ఖైరతాబాద్ చౌరస్తా వరకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో వాహనాదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లడం మంచిదని అదనపు సీపీ సూచించారు.
♦ తెలుగు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, స్పీకర్లు, శాసన మండలి చైర్మన్లు, హైకోర్టు చీఫ్ జస్టిస్ వేడుకకు హాజరవుతారు. వీరి వాహనాలు గేట్–1 నుంచి రాజ్‌భవన్‌లోకి వెళ్లి గేట్–2 నుంచి బయటకు రావాలి. ఆ తర్వాత వీటిని కేటాయించిన స్థలంలో పార్కు చేయాలి.
♦ పింక్ కారు పాస్ కల్గిన ఇతర అతిథులు గేట్–3 నుంచి లోపలికి వెళ్లి అక్కడే పార్కు చేయాలి. అదే గేట్ నుంచి బయటకు వెళ్లాలి. వైట్ కారు పాసు కల్గినవారు గేట్–3 వద్ద ఆగి ఆయా వాహనాలను ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్, సమీపంలోని పార్క్ హోటల్, మెట్రో రెసిడెన్సీ నుంచి నాసర్ స్కూల్ వరకు సింగిల్ లైన్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎదురుగా సింగిల్ లైన్‌లో పార్కింగ్ చేసుకోవాలి.
సికింద్రాబాద్‌లో...
పరేడ్ గ్రౌండ్‌లో జరిగే వేడుకల సందర్భంగా టివోలి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను బ్రూక్‌బాండ్, ఎన్‌సీసీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షలు ఉదయం 8 గంటల నుంచి 10గంటల వరకు అమలులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment