సాక్షి, సిటీబ్యూరో: వాలంటైన్స్ డే బహిష్కరణ పిలుపు, ప్రేమికులను అడ్డుకుంటామని, కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామంటూ కొన్ని సంఘాల హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పార్కులు, యూనివర్శిటీలు, పబ్స్, హోటళ్లు, మాల్స్, నెక్లెస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయనున్నారు. నగరంలో ఐదు జోన్లలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సన్నాహాలు ప్రారంభించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క ప్రైవేటు బౌన్సర్లకూ మంచి గిరాకీ ఏర్పడింది. నగరంలోని అనేక పబ్స్, మాల్స్, రెస్టారెంట్స్ యాజమాన్యాలు రోజు వేతనంపై వీరిని నియమించుకుంటున్నాయి. హెచ్చరికలు చేసిన వారిపై నిఘా ఉంచడం, అవసరమైతే ముందస్తు అరెస్టు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని ఐదు జోన్లలో పశ్చిమ మండలం అతి కీలకమైంది. అనేక పబ్‌లు, రెస్టారెంట్స్‌తో పాటు మాల్స్, పార్కులు ఇతర కీలక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. దీంతో అధికారులు ఈ జోన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓ పక్క సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటంతో పాటు నిర్వాహకులు సైతం నిబంధనలు, సమయాలను అతిక్రమించకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క నెక్లెస్‌రోడ్, ఐమాక్స్, ఎన్టీఆర్ మార్గ్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
బౌన్సర్లకు భలే గిరాకీ...
బౌన్సర్... ఈ పేరు పబ్‌లు, బార్లకు తరచు వెళ్లే వారికి సుపరిచితమే. మితిమీరి ప్రవర్తించే వారిని, హద్దు మీరి మద్యం సేవించి గొడవలు చేసే వారిని కట్టడి చేయడానికి శాశ్వత ప్రాతిపదికన యాజమాన్యాలు వీరిని నియమించుకుంటాయి. కండలు తిరిగిన శరీరం, కళ్లల్లో చురుకుతనం, చిరునవ్వు కూడా కనిపించని ముఖం, నల్లటి యూనిఫాం (సాధారణంగా షర్టు, టీషర్టు మాత్రమే నల్లవి ధరిస్తారు)లతో వీరు దర్శనమిస్తుంటారు. అయితే వాలెంటైన్ డే నేపథ్యంలో అనేక రెస్టారెంట్లు, మాల్స్ యాజమాన్యాలు సైతం వీరిని నియమించుకుంటున్నాయి. ఎవరికి వారు స్వీయ రక్షణ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పబ్స్, మాల్స్ తదితర సంస్థల యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో పాటు బౌన్సర్లనూ ఏర్పాటు చేసుకుంటున్నారు. శాశ్వత ప్రాతిపదికన బౌన్సర్లు కలిగిన సంస్థలు సైతం గురువారం ఒక్కరోజుకూ అదనంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ప్రైవేట్ బౌన్సర్లను అందించడానికి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలతో పాటు జిమ్స్ సైతం ఆసక్తి చూపుతున్నాయి. ఒక్కొక్కరికి రోజుకు రూ.2 వేల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తంలో 80 శాతం బౌన్సర్‌కు, 20 శాతం అతడిని ఏర్పాటు చేసిన సంస్థకు చెందుతాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment