రాష్ట్ర చేనేతకు ‘బ్రాండ్’ గుర్తింపు
♦ తెలుగు రాష్ట్ర్రాల నుంచి 21 ఉత్పత్తులకు గుర్తింపు
♦ పోచంపల్లి ఇక్కత్ సహా పలు ఉత్పత్తులకు ఐహెచ్‌బీ
♦ ఇకపై విదేశీ ఎగుమతులు, ఉపాధికి మరింత ఊతం
సాక్షి, హైదరాబాద్: ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ (ఐహెచ్‌బీ) పేరిట రాష్ట్రంలోని చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కనుంది. ఇప్పటికే రాష్ట్రం నుంచి 21 రకాలైన చేనేత ఉత్పత్తులకు ఈ బ్రాండ్ గుర్తింపు లభిం చింది. మరిన్ని పేరెన్నికగన్న ఉత్పత్తులు కూడా ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఐహెచ్‌బీ పొందిన చేనేత ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గిరాకీ పెరుగుతుంది. కార్మికులకు మెరుగైన ఉపాధి లభించనుంది. చేనేత రంగాన్ని ప్రోత్సహించేం దుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ను ప్రవేశ పెట్టిం ది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా గత ఏడాది ఆగస్టు ఏడో తేదీన ఐహెచ్‌బీని ఆవిష్కరించారు.
ధరించేవారి చర్మానికి హాని కలిగించని రీతిలో.. వస్త్ర ఉత్పత్తిలో ఉపయోగించే దా రం, రంగుల నాణ్యత, డిజైన్లలో నవ్యత తదితర అంశాలను పరిశీలించిన తర్వాతే.. ఆయా ఉత్పత్తులకు ఐహెచ్‌బీ గుర్తిం పు దక్కుతుంది. ఈ బ్రాండ్ కలిగి ఉన్న చేనేత ఉత్పత్తులను మాత్రమే ఇకపై విదేశాలకు ఎగుమతి చేయాలి. అయితే టెక్స్‌టైల్ కమిటీ ఆమోదించిన ఉత్పత్తులకు మాత్రమే ఐహెచ్‌బీ దక్కుతుంది. వస్త్ర నాణ్యత, నవ్యతను నిర్ధారించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న 17 అధునాతన ప్రయోగశాలల్లో పరీక్ష లు నిర్వహించి.. ఐహెచ్‌బీ గుర్తింపు ఇస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 500కుపైగా పేరెన్నికగన్న చేనేత ఉత్పత్తులు ఉం డగా.. ఇప్పటి వరకు 41 కేటగిరీలకు సంబంధించి 170 ఉత్పత్తులకు ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ గుర్తింపు దక్కింది. మరో 200 ఉత్పత్తులకు సంబంధించిన దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయి.
21 ఉత్పత్తులకు ఐహెచ్‌బీ
చీరలు, డ్రెస్ మెటీరియల్, బెడ్‌షీట్లు, షాలువాల తయారీలో దేశంలో పేరెన్నికగన్న చేనేత ఉత్పత్తులకు మాత్రమే ఈ బ్రాండ్‌ను ఇవ్వాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి దేశంలోనే తొలిసారిగా.. గత ఏడాది డిసెంబర్‌లో పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులకు ఐహెచ్‌బీ దక్కింది. తాజాగా కాటన్, సిల్క్ చీరలు, కాటన్, సిల్క్ డ్రెస్ మెటీరియల్, కాటన్ సిల్క్ విభాగంలో 21 చేనేత ఉత్పత్తులకు ఐహెచ్‌బీ గుర్తింపు ఇచ్చారు. కాటన్ చీరల కేటగిరీలో పోచంపల్లి, వెంకటగిరి, ఉప్పాడ, సిద్దిపేట, నారాయణపేట, మంగళగిరి.. సిల్క్ చీరల కేటగిరీలో పోచంపల్లి, ధర్మవరం, కాటన్ సిల్క్ చీరల కేటగిరీలో గద్వాల చేనేత ఉత్పత్తులకు గుర్తింపు ఇచ్చారు. కాటన్ డ్రెస్ మెటీరియల్‌లో పోచంపల్లి ఇక్కత్, మంగళగిరి, సిల్క్ డ్రెస్ మెటీరి యల్‌లో పోచంపల్లి ఇక్కత్, కాటన్ బెడ్‌షీట్లలో తెలంగాణ ఇక్కత్ ఉత్పత్తులకు ఐహెచ్‌బీ గుర్తింపు లభించింది.