బీఆర్‌జీఎఫ్ నిధులకు గ్రహణం | BRGF funds not released due to there is district planning committee | Sakshi
Sakshi News home page

బీఆర్‌జీఎఫ్ నిధులకు గ్రహణం

Published Tue, Aug 26 2014 11:48 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

BRGF funds not released due to there is district planning committee

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్‌జీఎఫ్)కి రాజకీయ గ్రహణం పట్టుకుంది. జిల్లా ప్లానింగ్ కమిటీ(డీపీసీ)లను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఖరారు చేయకపోవడంతో ఈ నిధుల విడుదలకు అడ్డంకిగా మారింది. దీంతో స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బీఆర్‌జీఎఫ్ కింద చేపట్టే పనులకు సాధారణంగా మే నెలలో ఆమోదం తెలపాల్సివుంటుంది. రాష్ట్ర విభజన , జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల ప్రభావం ఈ పనుల ఆమోదంపై పడింది.

ఈ పరిణామాల నేపథ్యంలో డీపీసీ సభ్యుల నియామకపు ప్రక్రియ నిర్వహణలో జాప్యం జరిగింది. రాష్ట్రస్థాయిలో కమిటీలను నియమించినప్పటికీ జిల్లా కమిటీలను ప్రకటించకపోవడంతో బీఆర్‌జీఎఫ్ ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. 2014-15వ ఆర్థిక సంవత్సరంలో రూ.28 కోట్లతో బీఆర్‌జీఎఫ్ పనులు చేపట్టాలని జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. దీంట్లో 50 శాతం మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలకు, 30శాతం మండల పరిషత్‌లకు, 20శాతం నిధులను జిల్లా పరిషత్‌లకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది.

 ప్రతిపాదనలు పూర్తి..
 జిల్లా, మండల పరిషత్‌లతోపాటు మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ఈ నిధులు కేటాయిస్తారు. ఇందులో సీసీ రోడ్లు, డ్రైనేజీ, అంగన్‌వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలను ప్రతిపాదిస్తారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.25.74 కోట్లతో 1,508 పనులు చేపట్టగా, వీటిలో గ్రామ పంచాయతీల్లో రూ.12 కోట్లు, మండల పరిషత్‌లలో రూ.7.5 కోట్లు, జిల్లా పరిషత్‌లో రూ.ఐదు కోట్ల పనులు పూర్తి చేశారు. అలాగే జిల్లాలోని మున్సిపాలిటీల్లో రూ. 1.24 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. దీనికి అనుగుణంగా ఈ సారి కూడా పనులకు సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేశారు. మే చివరినాటికే పనులకు తుదిరూపు ఇచ్చినప్పటికీ రాష్ట్ర విభజన, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వీటికి ఆమోదముద్ర పడలేదు.

 డీపీసీ ఆమోదిస్తేనే..
 ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో బీఆర్‌జీఎఫ్ ప్రతిపాదనలకు డీపీసీ సభ్యుల ఆమోదం తప్పనిసరి. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం సభ్యులను నామినేట్ చేసినప్పటికీ, జిల్లాలో ముగ్గురు నామినేటెడ్ సభ్యుల నియామకం ప్రక్రియ కొలిక్కిరాలేదు. దీంతో తొలి త్రైమాసిక పూర్తయినప్పటికీ బీఆర్‌జీఎఫ్ పనులకు అతిగతీ లేకుండా పోయింది. నిధుల వినియోగ ధ్రువపత్రాలు సమర్పిస్తేనే తదుపరి పనులకు నిధులను విడుదల చేయాలనే కేంద్రం ఆంక్షల నేపథ్యంలో.. డీపీసీ సభ్యుల నియామకంతో ఇప్పటికీ పనులకు ఆమోదం తెలపకపోవడం చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో పనులు పూర్తికావడం అనుమానంగానే కనిపిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement