నందిపేట: నందిపేట మండలం ఉమ్మెడ శివారులో గోదావరి నదిపై వంతెన నిర్మించే విషయంపై ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం తరువాత అదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలతో మన జిల్లాలోని నందిపేట మండలానికి సంబంధాలు తెగిపోయాయి. వీటిని పునరుద్ధరించడానికి గోదావరి నదిపై వంతెనను నిర్మించాలని పరివాహక గ్రామాల ప్రజలు ఎంతో కాలంగా కోరుతూ వస్తున్నారు.
స్థానిక నాయకులు కూడా అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా, గత ప్రభుత్వాలు
ఈ వి షయాన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలో రెండు జిల్లాలను అనుసంధానం చేస్తూ వంతెన నిర్మాణం చేపడతామని సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం ఆదేశాల మేరకు అదిలాబాద్ జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధ ం చేసి పంపించారు. దీంతో గోదావరి పరీవాహక ప్రాంతాల గ్రామాలలో ఆనందం వ్యక్తమవుతోంది.
తెప్పలపైనే ప్రయాణం
నందిపేట మండలంలోని పలు గ్రామాలకు అదిలాబాద్ జిల్లా లోకేశ్వరం, దిలావర్‌పూర్, ముథోల్, కుంటాల, భైంసా మండలాలతోపాటు మహారాష్ట్రలోని కిన్వట్ మండలాల ప్రజలకు సంబంధాలు ఉన్నాయి. ఎస్‌ఆర్‌ఎస్‌పీ నిర్మాణం చేపట్టడంతో 50 ఏళ్ల నుంచి ఈ ప్రాంతాల మధ్య తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ వైపు నుంచి అవతలి వైపునకు వెళ్లాలంటే వ్యయప్రయాసలకోర్చి దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. వేసవికాలంలో మాత్రం నదిలో నీటి ఉధృతి తగ్గడంతో మండ లంలోని ఉమ్మెడ, బాద్గుణ గ్రామాల వద్ద గల రేవుల నుంచి తెప్పలపై సుమారు రెండు కిలోమీటర్లు ప్రయాణించి అవతలి గ్రామాలకు చేరుతున్నారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ఉమ్మెడ-పంచగూడ గ్రామాల మధ్య వంతెనను నిర్మించేందుకు అదిలాబాద్ జిల్లా అధికారులు నదికిరుపక్కల సర్వే జరిపారు. 78 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. నదిలో సుమారు 600 మీటర్ల మేర వంతెన నిర్మించాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. వంతెనకు ఇరుపక్కల రెండు కిలో మీటర్లు మేర అనుసంధాన రోడ్డు వేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూములు ఉన్నందున భూసేకరణ సమస్యలేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆమోద ముద్ర పడిన వెంటనే అంచనాలు తయారు చేస్తామని చెబుతున్నారు.
పలువురి ఆందోళనలు
అన్నారం-గడిచంద గ్రామాల వంతెన నందిపేట మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అన్నారం వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సుమారు 800 మీటర్ల వరకు వంతెన నిర్మించాల్సి ఉంటుంది. బ్రిడ్జికి ఇరువైపులా నిర్మించే అనుసంధాన రదారి దూరం కూడా పెరుగుతుంది. అదిలాబాద్ జిల్లాలోని గ్రామాలకు వెళ్లేందుకు అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది.
నిర్మాణ వ్యయం సైతం అధికమవుతుంది. అన్నారం వద్ద వంతెన నిర్మాణం చేపట్టేందుకు నిజామాబాద్ జిల్లా అధికారులతో ప్రతిపాదనలు తయారుచేసేందుకు నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తమ గ్రామాల వద్ద వంతెన నిర్మాణం చే పట్టాలని ఉమ్మె డ, అన్నారం గ్రామాలతోపాటు చుట్టుపక్కల గ్రామాలవారు నాయకులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
కలల వారధి సాకారమవుతుందా?
Published Wed, Oct 1 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM
Advertisement
Advertisement