కరెంటు తీగకాటేసింది
- తెగిన విద్యుత్ తీగ
- నలుగురు కూలీల దుర్మరణం
వారంతా వలస కూలీలు.. మధ్యప్రదేశ్ నుంచి పొట్ట కూటికోసం నగరానికి వచ్చారు. తల్లిదండ్రులను చూసేందుకు స్వగ్రామాలకు చేరుకోవాలని రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. కొద్దిసేపు ఆగితే రెలైక్కి సొంతూరికి వెళ్లిపోయేవారు. కానీ విధి వక్రించింది. కరెంటుతీగ యమపాశమై వారిని కాటేసింది. విధి ఆడిన సర్కస్‌లో వారు విగత జీవులయ్యారు. సోమవారం రాత్రి నాంపల్లిలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం కండువా జిల్లా మచోలి ప్రాంతానికి చెందిన కొందరు యువకులు నగరంలోని జెమినీ సర్కస్‌లో పని చేసేందుకు వచ్చారు. తల్లిదండ్రులను చూసేందుకు స్వగ్రామాలకు వెళ్లాలని సోమవారం సాయంత్రం నాంపల్లి రైల్వేస్టేషన్‌కు బయలుదేరేందుకు సికింద్రాబాద్‌లో 8ఎ నంబర్ బస్సు ఎక్కారు. హజ్ హౌస్ దగ్గర రాత్రి 7.10కి దిగారు. అక్కడి నుంచి నాంపల్లి స్టేషన్‌కు నడుచుకుంటు వెళ్తున్న సమయంలో నే ఒక్కసారిగా భారీ వర్షం, గాలులు వీచాయి. దీంతో అక్కడే ఉన్న బస్టాప్‌లోకి వీరు వెళ్లారు. ఇదే బస్టాప్‌లో ఏర్పాటైన హోటల్ నిర్వాహకులు తీసుకున్న అక్రమ విద్యుత్ వైరు ఒకటి ఊడి కింద పడింది.
ఈ వైర్ బారికేడ్లపై పడింది. ఈ బారికేడ్లను పట్టుకుని ఉన్న యువకులు ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. ఆహాకారాలు మిన్నంటాయి. పక్కనే ఉన్న వందలామంది హజ్ యాత్రికులు పరుగుదీశారు. గాయపడ్డ వారిని సమీపంలోని మెడ్విన్, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రికి వెళ్లేలోపు రూపేంద్ర, రింకేష్, కౌసల్ మృతి చెందారు. ఉస్మానియాలో సుషీల్ కుమార్‌యాదవ్ మృతి చెందాడు. మణీష్, నగీన్ తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్నారు.
డిప్యూటీ సీఎం సందర్శన...
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ మాజీద్ హుస్సేన్, ఎమ్మెల్యేలు పాషాఖాద్రి, జాఫర్‌మెరాజ్ హుస్సేన్, ఎమ్మెల్సీలు సలీం, షబ్బీర్‌అలీ, సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ, బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్, గ్రేటర్ టీడీపీ అధికార ప్రతినిధి ఎం.ఆనంద్‌కుమార్‌గౌడ్ మెడ్విన్ ఆస్పత్రిలో మృతదేహాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ ఈ సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. మృతులకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఎక్స్‌గ్రేషియా అందేలా చూస్తానన్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
మృతుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, శాసనసభ పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్, గ్రేటర్ టీడీపీ అధికార ప్రతినిధి ఎం.ఆనంద్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించడంతో పాటు రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్‌శాఖ, జీహెచ్‌ఎంసీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
తప్పు మాది కాదు...
తెలంగాణ రాష్ర్ట టీ ఎస్‌సీపీడీసీఎల్ సీఎండీ, మేనేజింగ్ డెరైక్టర్ రఘుమారెడ్డి, ఆపరేషన్ డెరైక్టర్ నాగేందర్, హైదరాబాద్ జిల్లా చీఫ్ జనరల్ మేనేజర్ సతీష్, ఎస్సీ కృష్ణయ్య, డీఈ మురళీకృష్ణ సంఘటన స్థలాన్ని సందర్శించారు. హజ్‌హౌస్ తోరణాలకు కట్టిన వైరు లోపలి నుంచి తెగి బస్టాప్‌పైన పడినందునే నలుగురు మృత్యువాత పడినట్టు నిర్ధారించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ కృష్ణయ్య సాక్షితో మాట్లాడుతూ హజ్‌హౌస్ లోపల వైరు తెగి బస్టాప్‌పైన పడిందని, కాంట్రాక్టర్‌దే తప్పన్నారు.