మంత్రి సభ రభస | BT Road Construction work Laid the foundation stone Minister | Sakshi
Sakshi News home page

మంత్రి సభ రభస

Published Wed, May 13 2015 4:10 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

BT Road Construction work Laid the foundation stone Minister

- పోడుదారులు, పోలీసుల తోపులాట
- తుమ్మల కాన్వాయ్‌ను అడ్డగించిన గిరిజన మహిళలు  
- గుడితండాలో ఉద్రిక్తత, తోపులాటలో ఒకరి గాయాలు
- పోడుదారులకు అండగా నిలిచిన వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్, సీపీఎం
- పోలీసుల అదుపులో వైఎస్‌ఆర్‌సీపీ నేత కుర్సం
కారేపల్లి:
కారేపల్లి మండలంలో రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పోడుదారుల నుంచి చుక్కెదురైంది. మంగళవారం సాయంత్రం మండలంలోని గుడితండా నుంచి చీమలపాడు వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల సభా వేదిక పైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ మాట్లాడుతుండగా...పోడుదారులు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఫారెస్టు అధికారుల దాడులు ఆపాలని నినదిస్తూ సభావేదిక వైపు దూసుకు వచ్చారు. దీంతో అక్కడే ఉన్న ఇల్లందు డీఎస్పీ వీరేశ్వర్‌రావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు పోడు దారులను తోసివేశారు.

అదేవిధంగా పోడుదారుల పక్షాన వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కమిటీ సభ్యుడు కుర్సం సత్యనారాయణ, కారేపల్లి సోసైటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు ఈసాల నాగేశ్వరరావు, సీపీఎం మండల కార్యదర్శి కొండబోయిన నాగేశ్వరరావులు సభావేదిక వద్దకు వినతి పత్రాలతో రావడంతో...పోలీసులు వారిని సైతం నెట్టి వేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో గిరిజన రైతులతో పాటు, మహిళా గిరిజన రైతులు రోడ్లు మాకు వద్దు..పోడు భూములు కావాలని నినదిస్తూ సభా వేదిక వైపు వచ్చేందుకు ప్రయత్నించారు. మహిళా పోలీసులు వారిని అక్కడి నుంచి నెట్టి వేశారు. దీంతో పోలీసులకు , పోడు దారులకు తోపులాట జరిగింది. అంతకుముందు తోపులాటలో పోడుదారుడు భూక్యా హుస్సేన్ కిందపడటంతో కాలికి గాయమైంది.

పోలీసుల అదుపులో  వైఎస్‌ఆర్‌సీపీ నేత
పోడుదారుల పక్షాన నిలిచిన వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కమిటీ సభ్యుడు కుర్సం సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కుర్సం సత్యనారాయణను వదిలి వేయాలని పోడుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనికి స్పందించిన ఇల్లందు రూరల్  సీఐ  రమేష్  మంత్రి కార్యక్రమం పూర్తి అయ్యాక వదిలేస్తామని హామీ ఇస్తూ వారికి సర్ది చెప్పారు.

కార్లను అడ్డుకున్న మహిళలు
సభ ముగించుకొని వెళుతున్న మంత్రి తుమ్మల కాన్వాయ్‌ను గిరిజన మహిళలు అడ్డుకున్నారు. దీంతో ఇల్లందు రూరల్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు వారిని పక్కకు నెట్టి వేశారు. పోడు భూములు లాక్కుంటే...మా బ్రతుకులు ఏం కావాలని, ఇది మీకు న్యాయం కాదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

అరుచుకుంటే, కరుచుకుంటే ఏం జరగదు : మంత్రి
అరుచుకుంటే, కరుచుకుంటే ఏం జరగదని, ఎవరూ హైరానా పడాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల గుడి తండా సభా వేదిక పై మాట్లాడారు. సమస్యలను పరిష్కరించేందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉందని, రాజకీయాలు చేస్తే సహించమన్నారు. పేదలకు భయపడతాం కానీ, రాజకీయాలకు కాదని, కారేపల్లి మండలంలో గతంలో ఇల్లందు నియోజక వర్గంలో ఉండటం వల్ల ఎలాంటి అభివృద్ధికి నోచుకోక నిర్లక్ష్యానికి గురైందన్నారు. పోడు భూముల విషయమై  సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, గిరిజన రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు. మీరు ఆందోళనలు, రసాభాస చేయాల్సిన అవసరం లేదన్నారు.

అనంతరం పోలంపల్లి నుంచి పేరుపల్లి , గేటుకారేపల్లి నుంచి గంగారం తండా గ్రామాల్లో బీటీ రోడ్డు నిర్మాణాలకు మంత్రి తుమ్మల శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్, జడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత, టీఆర్‌ఎస్ నాయకులు కొండబాల కోటేశ్వరరావు, బిక్కసాని నాగేశ్వరరావు, జడ్పీటీసీ ఉన్నం వీరేందర్,  ఆర్‌అండ్‌బీ అధికారులు , తహశీల్దార్ మంగీలాల్, ఎంపీడీఓ ఎన్ శాంతాదేవి, సర్పంచ్ భూక్యా సైదా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement