ఖమ్మంక్రైం: సంచలనం సృష్టించిన గిరిజన మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదింనట్లు తెలిసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం రామన్న గుట్ట తండాకు చెందిన ఓ మహిళ(45) గత నెల 27న తన అత్తమ్మను ఖమ్మంలోని ఆస్పత్రిలో చూపించేందుకు వచ్చింది. ఆస్పత్రిలో పరీక్షలు పూర్తయ్యాక ఆటోలో వెళ్తుండగా అత్త మూత్రవిసర్జన కోసం కిందకు దిగగా.. సదరు మహిళను ఆటోడ్రైవర్ తీసుకెళ్లి అత్యాచారం చేయడంతో అపస్మారకస్థితికి చేరుకుందని, ఆపై ఆస్పత్రిలో వదిలేశాడని ప్రచారం జరిగింది. ఈ ఘటన మంగళవారం వెలుగు చూడగా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మహిళ బంధువులు ఆరోపించారు. దీంతో పోలీసులు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. కానీ మహిళను ఆస్పత్రిలో వదిలి వెళ్లిన సమయానికి సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, ఆమె అత్తకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో పోలీసుల కు చిక్కులు ఎదురయ్యాయి. చివరకు అన్ని కోణా ల్లో విచారణ చేపట్టిన పోలీసులు సదరు మహిళ రోడ్డు ప్రమాదంలోనే తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
రోడ్డు దాటుతుండగా...
ఆస్పత్రిలో సదరు మహిళ తన అత్తను చూపించాక ఇద్దరూ కలిసి ప్రధాన రహదారిపైకి చేరుకున్నారని తెలిసింది. ఈక్రమంలో వైరా రోడ్డులోని రిలయన్స్ ట్రెండ్ వద్ద మహిళను ద్విచక్రవాహనదారుడు బలంగా ఢీకొట్టడంతో ఎగిరి పడినట్లు సమాచారం. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడం, ఆమె అత్తమ్మ మానసిక స్థితి బాగా లేనందున ఓ ఆటోడ్రైవర్ సదరు మహిళ వెంట ఎవరూ లేరనకుని జనరల్ ఆస్పత్రిలో వెళ్లినట్లు తెలిసింది. ఆతర్వాత ఎలాగోలా ఆమె అత్త స్వగ్రామానికి చేరుకున్నా వివరాలు సరిగ్గా చెప్పలేకపోవడం, ఆటోలో తీసుకెళ్లినట్లు మాత్రం చూచాయగా చెప్పడం, మూడు రోజులు గాలించినా ఆచూకీ లేకపోవడంతో కుటుంబీకులు కిడ్నాప్, ఆపై అత్యాచారం జరిగినట్లు భావించినట్లు సమాచారం.
అన్ని కోణాల్లో విచారణ
గిరిజన మహిళ కిడ్నాప్, ఆపై అత్యాచారం జరిగి నట్లు ప్రచారం జరగడంతో పోలీసులు కేసును ఛేదించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె ఫొటో ఆధారంగా జిల్లా కేంద్రంలోని అన్ని ఆటో అడ్డాలో విచారించారు. అలాగే, గిరిజన మహిళకు స్వగ్రామంలో ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, భర్తతో సఖ్యత ఎలా ఉందో ఆరా తీశారు. అదేరోజు ఆమె బంధువులు ఎవరైనా ఖమ్మం వచ్చారా అని కూడా విచారణ చేపట్టారు. చోరీ కోణంలో విచారణ చేపట్టగా, మహిళ ఒంటిపై అంతంత మాత్రంగానే బంగారం ఉండడంతో దొంగలు పని కాదని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. చివరకు వివిధ షాపుల్లో సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా విచారించి రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సదరు మహిళ మృతి చెందినట్లు తేల్చిన పోలీసులు... గురువారం వివరాలు వెల్లడించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment