సంక్షేమ కోణంలోనే బడ్జెట్: ఈటెల
సంక్షేమంతో పాటు వ్యవసాయం, నిరుద్యోగుల ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తాం’ అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ వార్షిక బడ్జెట్ ఎలా ఉండబోతోందో సంక్షిప్తంగా వివరించారు.
హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను (2014) సంక్షేమ కోణంలో ప్రవేశపెట్టాం. అప్పుడుదాన్ని పది నెలలకాలానికే తయారు చేశాం. 2015-16 సంవత్సరానికి సంబంధించి.. పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. తొలి ఏడాదితో పోలిస్తే మా ప్రభుత్వ ప్రాధాన్యమేమీ మారలేదు. ఈ బడ్జెట్‌లోనూ ప్రజల సంక్షేమానికే పెద్దపీట వేస్తాం. సంక్షేమంతో పాటు వ్యవసాయం, నిరుద్యోగుల ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తాం’ అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ వార్షిక బడ్జెట్ ఎలా ఉండబోతోందో సంక్షిప్తంగా వివరించారు.
బుధవారం 11వ తేదీన అసెంబ్లీలో ఆయన తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కొత్త బడ్జెట్ ... ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు. ‘గతంతో పోలిస్తే ఆర్థిక అంశాలపై అవగాహన పెరిగింది. బృహత్తర పథకాలు.. భారీ అంచనాలుండటంతో వీటన్నింటికీ డబ్బులు ఎక్కడినుంచి తెస్తారు? అని అనుకుంటున్నారు. తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రమని 14వ ఆర్థిక సంఘం ఇటీవలే తమ నివేదికలో స్పష్టం చేసింది’ అని అన్నారు. గత బడ్జెట్ అంచనాలు తప్పింది కదా? అన్న ప్రశ్నకు స్పం దిస్తూ .. ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదని మంత్రి అంగీకరించారు.
సీఎం ఇస్తున్న హామీలు ఆర్థికంగా భారంగా మారుతున్నాయా..? అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘సీఎం ఇచ్చే హామీలన్నీ ప్రజసంక్షేమానికి సంబంధించినవే. ప్రజల ఆశలు, ఆకాంక్షలనే మేం పథకాలుగా రూపకల్పన చేశాం. మేనిఫెస్టోలో ప్రకటించకున్నా కల్యాణ లక్ష్మి, మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలను ప్రవేశపెట్టాం. వీటిని అమలు చేసేందుకు నిధుల కొరత ఉంటుందని అనుకోవడం లేదు. ఇప్పుడున్న పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం వద్ద పక్కా ప్రణాళిక ఉంది’ అని తెలిపారు.
రాష్ట్రం కుదురుకోవద్దన్నదే టీడీపీ అభిమతం
‘ఈ రాష్ట్రం కుదురుకోవద్దని, కుక్కలు చింపిన విస్తరిలా కావాలని టీడీపీ కోరుకుంటోంది, ఇది తప్ప ఆ పార్టీకి మరో ఎజెండా లేదు’ అని ఈటెల తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ కాళ్లకింద భూమి ఇప్పటికే కదిలిపోయిందని వ్యాఖ్యానించారు. ‘ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీని చీల్చి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకుంటున్న టీడీపీ ఇక్కడ మాత్రం గగ్గోలు పెడుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్న రాద్ధాంతం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.